టాయిలెట్‌లో 15 నిమిషాల కంటే ఎక్కువ కూర్చుంటున్నారా? పొంచి ఉన్న పెద్ద ప్రమాదం!

నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ పట్టుకుని టాయిలెట్‌కు వెళ్లడం, సోషల్ మీడియా రీల్స్ స్క్రోల్ చేస్తూ గంటల తరబడి క్లోసెట్‌పై కూర్చోవడం చాలా మందికి ఒక అలవాటుగా మారిపోయింది.

అయితే, ఎటువంటి హాని చేయదని మనం భావించే ఈ చిన్న అలవాటు మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిరోజూ 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం టాయిలెట్ సీటుపై గడపడం వల్ల పైల్స్ (మొలలు/Hemorrhoids), మలబద్ధకం తో పాటు జీర్ణవ్యవస్థకు సంబంధించిన తీవ్రమైన సమస్యలు వస్తాయని రోబోటిక్ కొలోరెక్టల్ అండ్ జిఐ సర్జన్ డాక్టర్ మంజునాథ్ హరిదాస్ హెచ్చరిస్తున్నారు.

క్లోసెట్‌పై ఎక్కువ సమయం కూర్చోవడం ఎందుకు ప్రమాదకరం?

మనం సాధారణ కుర్చీలో లేదా సోఫాలో కూర్చున్నట్లు టాయిలెట్ సీటుపై కూర్చోవడం ఒకేలా ఉండదు. కమోడ్ (Commode) మధ్య భాగం తెరిచి, ఓవల్ (Oval) ఆకారంలో ఉండటం వల్ల మనం కూర్చున్నప్పుడు మన వెనుక భాగానికి (Nittochs) ఎటువంటి సపోర్ట్ లభించదు. ఈ సమయంలో గురుత్వాకర్షణ శక్తి కారణంగా మలద్వారం మరియు మలాశయం (Rectum) చుట్టూ ఉన్న భాగంలో రక్త ప్రసరణ విపరీతంగా పెరుగుతుంది. రక్తం ఆ ప్రాంతంలోని సిరల్లో (Veins) వచ్చి పేరుకుపోవడం వల్ల, కాళ్లలో వచ్చే వారికోస్ వీన్స్ లాగా ఈ సిరలు వాచి ఉబ్బుతాయి. ఇదే తర్వాత తీవ్రమైన నొప్పిని కలిగించే పైల్స్ (మొలలు) వ్యాధిగా మారుతుంది.

‘స్ట్రెయినింగ్ పారడాక్స్’ (Straining Paradox)

మనం మొబైల్ ఫోన్ చూస్తూ మునిగిపోయినప్పుడు, మలవిసర్జన కోసం స్పృహతో ముక్కకపోయినా లేదా బలాన్ని ప్రయోగించకపోయినా.. మన పెల్విక్ ఫ్లోర్ కండరాలు (Pelvic floor muscles) తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. ఫోన్ వైపు చూడటం వల్ల శరీరం నుండి వచ్చే సహజమైన మలవిసర్జన సంకేతాలను మెదడు నిర్లక్ష్యం చేస్తుంది. దీనివల్ల మలం ప్రేగులలోనే ఉండిపోయి ఎండిపోయి గట్టిగా మారుతుంది, ఇది తీవ్రమైన మలబద్ధకానికి దారితీస్తుంది.

ఇతర ప్రధాన ఆరోగ్య సమస్యలు

నిరంతరాయంగా టాయిలెట్ సీటుపై ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల ఈ క్రింది సమస్యలు రావచ్చు:

  • పెల్విక్ ఫ్లోర్ కండరాల బలహీనత: మలవిసర్జనను నియంత్రించే పొత్తికడుపు కండరాలు బలహీనపడతాయి. ఇది భవిష్యత్తులో మలవిసర్జనపై నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది.
  • రెక్టల్ ప్రోలాప్స్ (Rectal Prolapse): విపరీతమైన ఒత్తిడి కారణంగా మలాశయం యొక్క కొంత భాగం మలద్వారం గుండా బయటకు వచ్చే ప్రమాదకరమైన పరిస్థితి ఇది.
  • బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్: టాయిలెట్‌లో ఫోన్ ఉపయోగించడం వల్ల దానిపైకి ప్రమాదకరమైన మలమూత్ర బ్యాక్టీరియాలు (E. coli వంటివి) చేరే అవకాశం చాలా ఎక్కువ. తర్వాత అదే ఫోన్‌ను ముఖం దగ్గరకు తెచ్చుకున్నా లేదా డైనింగ్ టేబుల్‌పై పెట్టినా అది విరేచనాలు, ఇతర కడుపు ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.

పరిష్కారం: 5 మినిట్స్ రూల్ (5-Minute Rule)

ఈ ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవడానికి వైద్యులు కొన్ని సులభమైన చిట్కాలను సూచిస్తున్నారు:

  1. ఫోన్‌ను బయట పెట్టేయండి: టాయిలెట్‌కు వెళ్లేటప్పుడు మొబైల్ ఫోన్లు, వార్తాపత్రికలు, పుస్తకాలను పూర్తిగా పక్కన పెట్టండి. టాయిలెట్ గదిని రీడింగ్ రూమ్‌గా మార్చవద్దు.
  2. 5 నిమిషాల నియమం: మలవిసర్జనను గరిష్టంగా 5 నుండి 10 నిమిషాల లోపు పూర్తి చేయండి. 5 నిమిషాలు దాటినా రాకపోతే కమోడ్ పైనుంచి లేచి వచ్చేయండి, మళ్లీ అనిపించినప్పుడు మాత్రమే వెళ్లండి.
  3. ఆహార నియమాలు మార్చుకోండి: ప్రతిరోజూ క్రమం తప్పకుండా కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగండి. ఓట్స్, పప్పుధాన్యాలు, పండ్లు, ఆకుకూరలు వంటి పీచు పదార్థాలు (Fiber food) ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.

Posted

in

by

Tags: