టాస్ వల్ల కాదు, ఇక్కడే ఓడిపోయాం… ఫైనల్ ఓటమి తర్వాత మిచెల్ సాంట్నర్ ఆవేదన

న్యూఢిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో భారత్ చేతిలో ఘోర పరాజయం తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. టీమిండియా ఓపెనర్లు ఇచ్చిన విధ్వంసకర ఆరంభం తర్వాత తమ జట్టు ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉందని, ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే అన్ని అంశాలు తమకు అనుకూలించాల్సి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

నాలుగోసారి ప్రపంచకప్ ఫైనల్ ఆడిన న్యూజిలాండ్ జట్టుకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. భారత్ చేతిలో 96 పరుగుల తేడాతో ఓడిపోవడంతో, కివీస్ జట్టు తొలి పరిమిత ఓవర్ల ప్రపంచకప్ టైటిల్ నిరీక్షణ కొనసాగుతోంది.

పవర్ ప్లేలో టీమిండియా శివతాండవం
ఈ మ్యాచ్‌లో సంజూ శామ్సన్ మరియు అభిషేక్ శర్మ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం పవర్ ప్లే (6 ఓవర్లు) లోనే 92 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. దీనికి విరుద్ధంగా, 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ పవర్ ప్లే ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 52 పరుగులు మాత్రమే చేయగలిగింది.

“పవర్ ప్లేలో 92 పరుగులు చేసిన క్రెడిట్ సంజూ మరియు అభిషేక్ శర్మలకే దక్కుతుంది. అక్కడి నుండి మ్యాచ్‌లోకి పుంజుకోవడం చాలా కష్టం” అని సాంట్నర్ పేర్కొన్నారు.

బౌలింగ్ విఫలంపై నిరాశ
న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. కానీ భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లను అడ్డుకోవడంలో కివీస్ బౌలర్లు విఫలమయ్యారు. దీనిపై సాంట్నర్ మాట్లాడుతూ.. “ఆరంభంలో బంతి సీమ్ లేదా స్వింగ్ అవ్వలేదు. సంజూ, అభిషేక్, ఇషాన్ కిషన్ మైదానం నలుమూలల షాట్లు ఆడటంలో దిట్టలు. బ్యాటర్లు అంత ఫామ్‌లో ఉన్నప్పుడు ఏ వ్యూహం కూడా పక్కాగా పనిచేయదు. మేము యార్కర్లు, వైడ్ డెలివరీలు, లెగ్ సైడ్ బౌలింగ్.. ఇలా అన్నీ ప్రయత్నించాం. కానీ వారి దూకుడు ముందు మా ప్రయత్నాలేవీ ఫలించలేదు” అని వాపోయారు.

అహ్మదాబాద్ పిచ్ గురించి వివరిస్తూ.. అక్కడ స్పిన్నర్లకు పెద్దగా సహకారం అందలేదని, కేవలం పేసర్లకు మాత్రమే కొంత బౌన్స్ లభించిందని సాంట్నర్ తెలిపారు. అందుకే స్పిన్నర్ కోల్ మెక్‌కోంచీ స్థానంలో పేసర్ జాకబ్ డఫ్ఫీని తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.


Posted

in

by

Tags: