భారత్-అమెరికా సంబంధాలు: టెక్సాస్ అటార్నీ జనరల్ పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి ఆరోన్ రీట్జ్ (Aaron Reitz), ఎక్స్ (X) వేదికగా భారత్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారితీశాయి. తాను టెక్సాస్‌ను భారత్ లేదా పాకిస్థాన్‌లా మార్చాలని అనుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.
అమెరికాలో కలిసిపోని (un-assimilated) భారతీయుల చొరబాటు పెరిగిపోయిందని, దీనివల్ల టెక్సాస్‌లోని కొల్లిన్, డల్లాస్ మరియు హారిస్ కౌంటీలకు త్వరలోనే కలకత్తా, ఢిల్లీ మరియు హైదరాబాద్ కౌంటీలుగా పేరు మార్చాల్సి వస్తుందని ఆయన వివాదాస్పద పోస్ట్ చేశారు. గ్లోబల్ కంపెనీలు టెక్సాస్‌లోని ఆర్థిక వెసులుబాటును వాడుకోవడానికి ఇక్కడికి వస్తున్నాయని ఆయన విమర్శించారు.
“అమెరికా కార్మికులపై చిన్నచూపు చూస్తూ, చౌకగా దొరికే కార్మికుల కోసం ఈ కంపెనీలు H-1B వీసా కుంభకోణానికి పాల్పడుతున్నాయి. వీటన్నింటినీ వెనక్కి తీసుకోవాలి. నేను అటార్నీ జనరల్ అయ్యాక, ట్రంప్ ప్రభుత్వంతో కలిసి వీరి ‘లీగల్’ పేపర్‌వర్క్‌ను మళ్ళీ తనిఖీ చేస్తాను. మెజారిటీ మందిని డీపోర్ట్ (దేశం నుండి పంపించివేయడం) చేస్తాను. మిగిలిన వారిని ఇక్కడ కలిసిపోయేలా చేస్తాను. మన దేశాన్ని కేవలం ఒక ఆర్థిక జోన్లా చూసే కంపెనీలపై చర్యలు తీసుకుంటాను. ఇది టెక్సాస్, USA – భారత్ లేదా పాకిస్థాన్ కాదు,” అని ఆయన పోస్ట్ చేశారు.
రీట్జ్ దొంగ వేషాలు బయటపెట్టిన నెటిజన్లు
రీట్జ్ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే సిద్ధార్థ్ (@Cloudwatch199) అనే నెటిజన్ అతని నిజస్వరూపాన్ని బయటపెట్టారు. రీట్జ్ ఎన్నికల ప్రచారానికి భారీగా విరాళాలు ఇచ్చే వారిలో ఒకరు పాకిస్థాన్ సంతతికి చెందిన అనోష్ అహ్మద్ అనే డాక్టర్ అని ఆధారాలతో సహా నిరూపించారు. అంతేకాకుండా, అనోష్ కొవిడ్-టెస్టింగ్ మోసం కేసులో నిందితుడని కూడా పేర్కొన్నారు.
“ఆరోన్ రీట్జ్ టెక్సాస్‌ను ఢిల్లీ లేదా హైదరాబాద్‌లా మార్చకూడదని నటిస్తున్నారు, కానీ వాస్తవానికి ఆయన ఇస్లామిస్ట్ శక్తుల అండతో దీనిని లాహోర్ లేదా కరాచీలా మారుస్తున్నారు. భారతీయ నగరాల పేర్లను జాత్యహంకార దూషణలుగా వాడటం అసహ్యకరం,” అని సిద్ధార్థ్ మండిపడ్డారు. టెక్సాస్ క్యాంపెయిన్ ఫైనాన్స్ ఫైలింగ్స్ ప్రకారం, రీట్జ్ అగ్రగామి దాతల్లో ఒకరైన అనోష్ అహ్మద్ నుండి 1,00,000 డాలర్ల (సుమారు ₹83 లక్షలు) విరాళం తీసుకున్నట్లు వెల్లడైంది.
గణాంకాలతో బుద్ధి చెప్పిన లాయర్
హ్యూస్టన్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్ అటార్నీ స్టీవెన్ బ్రౌన్ గణాంకాలతో రీట్జ్కు చురకలంటించారు. టెక్సాస్ జనాభాలో భారతీయుల వాటా కేవలం 2 శాతం కంటే తక్కువ అని ఆయన గుర్తు చేశారు.
- వాస్తవం: టెక్సాస్ జనాభాలో భారతీయులు 2% కన్నా తక్కువ ఉన్నప్పటికీ, వారిని చొరబాటుదారులుగా చిత్రీకరించడం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
- H-1B నిజా నిజాలు: భారతీయ ఐటీ నిపుణులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల కొద్దీ ఆదాయాన్ని, పన్నుల రూపంలో అందిస్తున్నారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
అమెరికాలో భారతీయుల ఎదుగుదలపై ఇలాంటి జాత్యహంకార వ్యాఖ్యలు రావడం పట్ల ప్రవాస భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
