గత మంగళవారం టెల్ అవీవ్ ఆకాశంలో అకస్మాత్తుగా కనిపించిన వేలాది కాకుల గుంపును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వేలాది కాకులు నగరంపైనే గంటల తరబడి చక్కర్లు కొడుతూ కనిపించాయి.
ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, ఇరాన్ యుద్ధం మరియు మధ్యప్రాచ్య సంక్షోభం నేపథ్యంలో ప్రజలు దీనికి రకరకాల అర్థాలు తీస్తున్నారు. ఇది రాబోయే ఏదో పెద్ద విపత్తుకు సంకేతమని కొందరు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
టెల్ అవీవ్ నీలి ఆకాశంలో నల్లని కాకుల గుంపు: నీలిరంగు ఆకాశంలో వేలాది నల్లని కాకులు గుంపులుగా తిరుగుతుండటం అస్సలు సాధారణ దృశ్యంలా అనిపించలేదు. అక్కడ ఉన్న స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. సోషల్ మీడియాలో చాలామంది దీనిని ‘ప్రళయానికి సంకేతం’ (Sign of Apocalypse) అని అభివర్ణించారు.
కొందరు దీనిని బైబిల్ ప్రవచనాలతో ముడిపెట్టారు. బైబిల్లోని 19:17 వచనాన్ని ఉటంకిస్తూ.. గాలిలో ఎగిరే పక్షులన్నీ భగవంతుని గొప్ప విందుకు సిద్ధమవ్వాలని ఒక దేవదూత పిలుపునిస్తున్నట్లుగా దీనిని చిత్రీకరించారు.
నిపుణులు ఏమంటున్నారు? ఈ అంశంపై పక్షి శాస్త్రవేత్తలు స్పందిస్తూ.. ఇది అసాధారణమైన ఘటన ఏమీ కాదని తేల్చి చెప్పారు. ప్రపంచంలో పక్షులు వలస వెళ్లే ప్రధాన మార్గాల్లో టెల్ అవీవ్ ఆకాశమార్గం ఒకటి. వసంతకాలంలో (Spring season) సుమారు 50 కోట్ల పక్షులు ఇజ్రాయెల్ మీదుగా ప్రయాణిస్తాయి. ఈ క్రమంలో కాకులు తమ గూళ్లు కట్టుకోవడానికి లేదా వాతావరణ మార్పుల వల్ల ఇలా గుంపులుగా రావడం సర్వసాధారణం. మార్చి నెలలో ఇలాంటి దృశ్యాలు ఇజ్రాయెల్‌లో తరచుగా కనిపిస్తుంటాయి, దీనిని విపత్తుతో ముడిపెట్టడం సరికాదని వారు స్పష్టం చేశారు.
అపశకునంగా భావిస్తున్న నెటిజన్లు: నిపుణులు శాస్త్రీయ కారణాలు చెబుతున్నప్పటికీ, మధ్యప్రాచ్యంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ప్రజలు దీనిని అశుభ సంకేతంగానే చూస్తున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ.. “రోమన్ కాలంలో పక్షుల కదలికలను బట్టి యుద్ధాల ఫలితాలను అంచనా వేసేవారు, కొన్నిసార్లు యుద్ధాలను కూడా ఆపేవారు” అని రాశారు.
ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించడం, అమెరికా తన 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన 1000 మంది సైనికులను మధ్యప్రాచ్యానికి పంపడం వంటి పరిణామాల వల్ల ఈ ‘కాకుల వీడియో’ మరింత భయాన్ని కలిగిస్తోంది.
