ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో జరిగిన దిగ్భ్రాంతికరమైన ‘పాము హత్య కేసు’లో, భర్త అమిత్‌ను హత్య చేసి పాము కాటుతో చనిపోయినట్లు నాటకమాడిన భార్య రవిత, ఆమె ప్రియుడు అమర్‌దీప్‌లకు కోర్టు ఉరిశిక్ష (మరణశిక్ష) విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
అమిత్‌తో కలిసి టైల్స్ పని చేసే అమర్దీప్, పని విషయమై తరచుగా అమిత్ ఇంటికి వస్తూ వెళుతున్న క్రమంలో రవితతో అతనికి అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం అమిత్‌కు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు, ఘర్షణలు జరుగుతూ వచ్చాయి.
ఘటన జరిగిన రోజున అమిత్‌ను ఇంట్లోనే గొంతు నులిమి చంపిన ఇద్దరూ, పోలీసులను ఏమార్చేందుకు మృతదేహం దగ్గర ఒక పామును తీసుకొచ్చి పెట్టి.. ఇది పాము కాటు వల్ల జరిగిన సహజ మరణంగా నమ్మించడానికి నాటకమాడారు.
అయితే, అమిత్ మృతదేహం పడి ఉన్న తీరు, అతని శరీరంపై ఉన్న గాయాలను చూసి అనుమానించిన బంధువులు, రవిత ఎంతగా అడ్డుకున్నప్పటికీ పోలీసుల సహాయంతో పోస్టుమార్టం నిర్వహించేలా చేశారు.
ఆ పరీక్షలో అమిత్ పాము కాటు వల్ల చనిపోలేదని, గొంతు నులిమి దారుణంగా హత్య చేయబడ్డాడని తేలింది. హంతకులు పక్కా ప్రణాళికతోనే ఈ నాటకానికి తెరతీశారనే నిజం వెలుగులోకి రావడం గమనార్హం.

Leave a Reply