నేషనల్ హైవేలపై (NH) టోల్ కట్టకుండా వెళ్లే వాహనదారులకు ఇకపై ప్రభుత్వ సేవల్లో ఆటంకాలు ఎదురుకానున్నాయి. పెండింగ్లో ఉన్న టోల్ బకాయిలను చెల్లించకపోతే.. వాహన యాజమాన్య బదిలీ (Ownership Transfer), ఫిట్నెస్ సర్టిఫికేట్ పునరుద్ధరణ మరియు పర్మిట్ల వంటి సేవలను నిలిపివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం ‘కేంద్ర మోటార్ వాహనాల (రెండవ సవరణ) నియమాలు, 2026’ ను నోటిఫై చేసింది. టోల్ వసూళ్లను క్రమబద్ధీకరించడానికి మరియు ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ETC) వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ మార్పులు చేపట్టింది.
కొత్త నిబంధనల ప్రకారం:
- NOC నిలిపివేత: వాహనాన్ని ఒకరి పేరు నుండి మరొకరి పేరు మీదకు మార్చాలన్నా లేదా ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్నా ఇచ్చే ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NOC), పెండింగ్ టోల్ బకాయిలు చెల్లిస్తేనే జారీ అవుతుంది.
- ఫిట్నెస్ సర్టిఫికేట్: వాహనాలకు ఇచ్చే ఫిట్నెస్ సర్టిఫికేట్ పునరుద్ధరణ లేదా జారీ కావాలంటే టోల్ బాకీలు ఉండకూడదు.
- నేషనల్ పర్మిట్: కమర్షియల్ వాహనాలు నేషనల్ పర్మిట్ పొందాలంటే ఎటువంటి టోల్ బకాయిలు ఉండకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF): రాబోయే రోజుల్లో నేషనల్ హైవేలపై అడ్డంకులు (Barriers) లేని టోల్ వసూలు వ్యవస్థను (MLFF) తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల వాహనాలు ఆపకుండానే టోల్ వసూలు అవుతుంది. అప్పుడు ఎవరైనా టోల్ కట్టకుండా వెళ్తే, ఆ మొత్తాన్ని ‘చెల్లించని రుసుము’గా పరిగణించి పైన పేర్కొన్న సేవల సమయంలో వసూలు చేస్తారు.
