అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. అమెరికాలో జన్మించే విదేశీయుల పిల్లలకు లభించే ‘బర్త్ రైట్ సిటిజన్‌షిప్’ను రద్దు చేయాలన్న ట్రంప్ నిర్ణయానికి కోర్టు తెరదించింది. అమెరికా గడ్డపై జన్మించే దాదాపు ప్రతి బిడ్డకు పుట్టుకతోనే అమెరికన్ పౌరసత్వం లభిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా వలస వచ్చిన లక్షలాది మందికి, ముఖ్యంగా భారతీయ ప్రొఫెషనల్స్‌కు పెద్ద ఊరట.
సుప్రీంకోర్టు తీర్పు: అమెరికన్ సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ద్వారా దశాబ్దాలుగా అమలులో ఉన్న హక్కులను కేవలం ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏ అధ్యక్షుడూ మార్చలేరని కోర్టు స్పష్టం చేసింది. తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనంలో ఆరుగురు ఈ చట్టాన్ని సమర్థించారు.
ఏమిటీ ‘బర్త్ రైట్ సిటిజన్‌షిప్’ వివాదం? అమెరికాలో ‘జస్ సోలి’ (Jus Soli) లేదా ‘బర్త్ రైట్ సిటిజన్‌షిప్’ అనే చట్టం ఉంది. దీని ప్రకారం, విదేశీ జంటలకు అమెరికా గడ్డపై జన్మించే పిల్లలకు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అయితే, ఈ చట్టం వల్ల అక్రమ వలసలు పెరుగుతున్నాయని, ఇది దేశ వనరులపై భారం అని ట్రంప్ వాదిస్తూ వచ్చారు. దీనిని ‘యాంకర్ బేబీస్’ అని ఆయన పిలిచేవారు.
భారతీయులకు ఎందుకు ఊరట? ప్రస్తుతం అమెరికాలో H-1B, L1 వీసాలపై వేల సంఖ్యలో భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు. వీరు గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తుంటారు. ఒకవేళ ట్రంప్ ఆదేశాలు అమలులోకి వస్తే, వీరికి పుట్టే పిల్లలకు పౌరసత్వం లభించక వారి భవిష్యత్తు, చదువు, వైద్య సదుపాయాలు తీవ్ర సంక్షోభంలో పడేవి. ఇప్పుడు కోర్టు తీర్పుతో భారతీయ కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. రాజ్యాంగంలో మార్పులు చేసే అధికారం కేవలం పార్లమెంటుకే ఉందని, అధ్యక్షుడికి లేదని కోర్టు స్పష్టం చేయడంతో ట్రంప్ నిర్ణయం చెల్లదని తేలిపోయింది.
