వాషింగ్టన్: ఈరాన్ – అమెరికా మధ్య యుద్ధం గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో, అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్-15 (F-15 Eagle) యుద్ధ విమానాన్ని ఈరాన్ కూల్చివేసింది. ఈ ఘటన సమయంలో అమెరికా పైలట్లు గల్లంతైన వేళ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు వెలువడుతున్న సమాచారం సంచలనం సృష్టిస్తోంది.
గత ఫిబ్రవరి నెలాఖరులో అమెరికా-ఈరాన్ మధ్య ఘర్షణ మొదలైంది. ఈ పోరు కొన్ని వారాల పాటు అత్యంత తీవ్రంగా సాగింది. ఈ క్రమంలో ఈరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించారు. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్న తరుణంలో పరిస్థితి విషమించింది. అయితే, యుద్ధం పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వైట్ హౌస్ లోపల జరిగిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ట్రంప్ పక్కన పెట్టబడ్డారా? ఏప్రిల్ 3వ తేదీన అమెరికా యుద్ధ విమానాలను ఈరాన్ కూల్చివేసింది. ఒక పైలట్‌ను వెంటనే రక్షించినప్పటికీ, రెండో పైలట్ ఈరాన్ పర్వత ప్రాంతంలో చిక్కుకుపోయాడు. అతని కోసం వెతకడం ‘గడ్డి వాములో సూదిని వెతకడం’ లాంటిదని అధికారులు అభివర్ణించారు.
CIA మాస్టర్ ప్లాన్: ముందుగా ఈరాన్ దళాలను తప్పుదారి పట్టించడానికి, “పైలట్‌ను రక్షించేశాం” అని CIA ఒక తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసింది. దీనివల్ల ఈరాన్ దళాలు తమ గాలింపు చర్యలను ఆపి రిలాక్స్ అయ్యాయి. అదే సమయంలో అమెరికా దళాలు ఆ పైలట్‌ను గుర్తించాయి. కొండల మధ్య దాక్కున్న ఆ వీరుణ్ణి CIA మరియు పెంటగాన్ దళాలు కలిసి సురక్షితంగా రక్షించాయి.
పైలట్‌ను రక్షించే ఆపరేషన్ మిలిటరీ కంట్రోల్ రూమ్‌లో జరుగుతున్నప్పుడు, అధ్యక్షుడు ట్రంప్‌ను అక్కడి నుండి దూరం పెట్టినట్లు సమాచారం. ట్రంప్ యొక్క అసహనం మరియు కోపం యుద్ధ చర్యలపై ప్రభావం చూపుతాయని భావించి, అతన్ని ఆ గదిలోకి అనుమతించలేదట. ఉపాధ్యక్షుడు జె.డి. వెన్స్ మరియు ఉన్నతాధికారులు మాత్రమే ప్రత్యక్ష చర్చల్లో పాల్గొన్నారు.
అరిచిన ట్రంప్: ట్రంప్‌కు కేవలం ముఖ్యమైన సమయాల్లో మాత్రమే ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ట్రంప్, తన అధికారులపై గంటల తరబడి కేకలు వేస్తూ విరుచుకుపడ్డారని అమెరికన్ మీడియా ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది.
పైలట్‌ను రక్షించిన తర్వాత, ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈరాన్‌ను హెచ్చరిస్తూ పోస్టులు పెట్టారు. అందులో అసాధారణంగా మతపరమైన పదాలను వాడటం వివాదాస్పదమైంది. దీని గురించి అప్పుడే ట్రంప్ తన సలహాదారులతో.. “ఈరాన్ నాయకులను అయోమయంలో నెట్టడానికి, వారిని రెచ్చగొట్టడానికే ఇలా చేశాను. నేను ఏం చేస్తానో ఎవరూ ఊహించలేరని వారు గ్రహించాలి” అని అన్నట్లు తెలుస్తోంది.
ట్విస్టుల మీద ట్విస్టులు: ఏప్రిల్ 7వ తేదీన “ఈ రాత్రి ఒక నాగరికత అంతం కాబోతోంది” అని ఈరాన్‌ను బెదిరించిన ట్రంప్, హార్ముజ్ జలసంధిని తెరవాలని ఆదేశించారు. కానీ, కొద్ది గంటల్లోనే ఏప్రిల్ 8 నుండి రెండు వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. గత కొద్ది రోజులుగా కాల్పుల విరమణను పొడిగించే ప్రసక్తే లేదన్న ట్రంప్, రాత్రికి రాత్రే తన నిర్ణయాన్ని మార్చుకుని దానిని పొడిగించడం గమనార్హం.
