ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై కొత్త ప్రశ్నలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ట్రంప్ కనిపించిన తీరును చూసి ఈ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

న్యూయార్క్ పోస్ట్ పాడ్‌కాస్ట్ ‘పాడ్ ఫోర్స్ వన్’లో జర్నలిస్ట్ మిరాండా డెవిన్‌తో మాట్లాడుతుండగా, ట్రంప్ కుడి కన్ను, చేతి చుట్టూ వాపు ఉన్నట్లు సోషల్ మీడియా వినియోగదారులు గమనించారు. ఈ వ్యాఖ్యలపై వైట్ హౌస్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన తెలపలేదు. ఇటీవలే ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్న నేపథ్యంలో, ఆయన ఆరోగ్యంపై జరుగుతున్న ఈ చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వైద్య నివేదికపై భిన్న వాదనలు: 79 ఏళ్ల ట్రంప్ గత 13 నెలల్లో మూడుసార్లు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల తర్వాత ట్రంప్ పరిపాలనా విభాగం విడుదల చేసిన వైద్య నివేదికలో ఆయన ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే, దీనిపై కొందరు వైద్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. “ఆయన వయస్సుకి ఇంతటి ఆరోగ్య నివేదిక రావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది” అని ఒక వైద్యుడు పేర్కొన్నారు. ట్రంప్ తీవ్రమైన శారీరక లేదా మానసిక (Cognitive) ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారనే వాదనను వైట్ హౌస్ పదేపదే ఖండిస్తూ వస్తోంది.

ఆరోపణలు – వాదనలు: ఇటీవల కాలంలో ట్రంప్‌కు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పులపై విమర్శకులు దృష్టి సారించారు. ట్రంప్ తన రెండో విడత పదవీ కాలంలో స్ట్రోక్‌కు గురై ఉండవచ్చని వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ బ్రూస్ డేవిడ్‌సన్ పేర్కొన్నారు (అయితే దీనికి తగిన ఆధారాలు చూపలేదు). ఆయన ప్రసంగాల్లో పదాలను తడబడటం, బహిరంగ కార్యక్రమాల్లో తక్కువగా కనిపించడం వంటి అంశాలు చర్చకు దారితీశాయి. బుధవారం, రాజకీయ వ్యాఖ్యాత బ్రయాన్ క్రాసెన్‌స్టెయిన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తూ, అధ్యక్షుడి ముఖం ఉబ్బినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు, కాబినెట్ సమావేశంలో ట్రంప్ నిద్రపోతున్నట్లున్న వీడియోను డెమొక్రాటిక్ కాంగ్రెస్‌మెన్ టెడ్ లీయు పోస్ట్ చేస్తూ, ఆయన ఆరోగ్య పరిస్థితి లేదా మానసిక సామర్థ్యాల్లో ఏదో లోపం ఉందని విమర్శించారు.

ఏది ఏమైనప్పటికీ, అధ్యక్షుడు తన బాధ్యతలను నిర్వహించడానికి పూర్తిగా సమర్థుడని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇటువంటి ఆరోపణలన్నింటినీ వారు కొట్టిపారేస్తున్నారు.


Posted

in

by

Tags: