అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు వాటికన్ నగరం అధిపతి పోప్ లియో XIV మధ్య వివాదం మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకుంది. పోప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన కొద్దిసేపటికే, ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సంచలన ఏఐ (AI) ఫోటోను షేర్ చేశారు. ఇందులో తనను తాను సాక్షాత్తు యేసుక్రీస్తులా, అద్భుతాలు చేసే దైవిక శక్తిగా చిత్రించుకోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అటు రాజకీయ, ఇటు మతపరమైన ప్రకంపనలు సృష్టిస్తోంది.
వివాదాస్పద ఏఐ ఫోటోలో ఏముంది?
వైరల్ అవుతున్న ఆ ఫోటోలో ట్రంప్ ఒక పొడవాటి అంగీ ధరించి, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిపై చేయి ఉంచి ‘స్వస్థత’ చేకూరుస్తున్నట్లు (చమత్కారం) కనిపిస్తున్నారు. ఈ ఫోటో వెనుక నేపథ్యంలో అమెరికా జెండాలు, సైనిక విమానాలు మరియు దేవదూతల వంటి ఆకృతులు ఉన్నాయి. తన రాజకీయ ఉద్దేశ్యాలకు మతపరమైన రంగు పులుముతూ ట్రంప్ చేసిన ఈ పోస్ట్ క్రైస్తవ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
పోప్ లియోపై ట్రంప్ ధ్వజమెత్తు..
ఈ ఫోటో కంటే ముందు ట్రంప్, పోప్ లియో XIVపై చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. పోప్ కేవలం ‘లెఫ్ట్ వింగ్’ (వామపక్ష) భావజాలానికి మద్దతు ఇస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.
- నేరాల పట్ల ఉదాసీనత: పోప్ నేరాల పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని, విదేశీ విధానంలో ఆయన వైఖరి దారుణమని ట్రంప్ విమర్శించారు.
- ఇరాన్ అణు పరీక్షల మద్దతు: “ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండటాన్ని సమర్థించే పోప్ నాకు అక్కర్లేదు. వెనిజులాపై అమెరికా తీసుకునే చర్యలను తప్పుబట్టే అధికారం ఆయనకు లేదు” అని ట్రంప్ విరుచుకుపడ్డారు.
- నేనే పదవి ఇప్పించా: అసలు పోప్ లియో ఆ రేసులోనే లేరని, తన వల్లే ఆయనకు ఆ పదవి దక్కిందని ట్రంప్ ఒక వింత వాదనను తెరపైకి తెచ్చారు.
రాజకీయాల్లోకి రావద్దు: వాటికన్‌కు హెచ్చరిక
పోప్ లియో అమెరికా మూలాలున్న వ్యక్తి అయినప్పటికీ, అంతర్జాతీయ వివాదాల్లో ఆయన అవలంబిస్తున్న శాంతి మంత్రం ట్రంప్ యొక్క “అమెరికా ఫస్ట్” విధానాలకు అడ్డంకిగా మారింది. “పోప్ రాజకీయాలు మానేసి, తన మతపరమైన బాధ్యతలపై దృష్టి పెడితే మంచిది. తీవ్రవాద వామపక్షాలకు మద్దతు ఇవ్వడం వల్ల కాథలిక్ చర్చికి తీరని నష్టం జరుగుతుంది” అని ట్రంప్ హెచ్చరించారు.
అంతర్జాతీయంగా ముదురుతున్న ఉద్రిక్తత
వైట్ హౌస్ మరియు వాటికన్ మధ్య పెరుగుతున్న ఈ దూరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కాథలిక్కుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ బహిరంగంగా పోప్‌ను విమర్శిస్తున్నప్పటికీ, వాటికన్ ఇప్పటివరకు దీనిపై అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం. ఒకవైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఆధ్యాత్మిక గురువుతో అమెరికా అధ్యక్షుడు పెట్టుకున్న ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.
