ముంబైకి చెందిన గౌరవ్ లోండే అనే యువకుడు, అందరూ అసహ్యించుకునే ‘ట్రాఫిక్ జామ్’ సమస్యనే తన వ్యాపార అవకాశంగా మార్చుకుని విజయం సాధించాడు. ఈ స్ఫూర్తిదాయకమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రారంభం ఇలా.. 2009లో సాధారణ పిజ్జా డెలివరీ బాయ్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన గౌరవ్, ప్రతిరోజూ అంధేరీ నుండి తన స్వగ్రామమైన థానేకు 24 కి.మీ దూరాన్ని భారీ ట్రాఫిక్‌లో దాటడానికి దాదాపు 3 గంటల సమయం పట్టేది. ఆ సమయంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఎంతోమంది ఆకలితో అలమటించడం గమనించిన ఆయనకు ఒక ఐడియా వచ్చింది. “ట్రాఫిక్‌లో ఇబ్బంది పడుతున్న వారికి అక్కడికక్కడే వేడి వేడి వడాపావ్ ఇస్తే ఎలా ఉంటుంది?” అని ఆలోచించాడు.
వ్యాపారంగా మార్పు: ఆ ఆలోచనతోనే 2019లో తన తల్లి ఆర్థిక సహాయంతో ‘ది ట్రాఫిక్ వడాపావ్’ (The Traffic Vada Pav) అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు. మొదట్లో ప్రజలు కొనడానికి సంకోచించడంతో, గౌరవ్ 50 వడాపావ్‌లను నీళ్ల బాటిల్, టిష్యూ పేపర్‌తో అందంగా ప్యాక్ చేసి ఉచితంగా పంచిపెట్టాడు. ఆ తర్వాత ప్రజల నమ్మకాన్ని పొందాడు.
సక్సెస్ జర్నీ: కేవలం 20 రూపాయలకే విక్రయించే ఈ వడాపావ్‌లను, సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆరెంజ్ రంగు టీ-షర్టులు వేసుకున్న గౌరవ్ బృందం మెరుపు వేగంతో డెలివరీ చేస్తుంది. ఒకప్పుడు డెలివరీ బాయ్‌గా పనిచేసిన గౌరవ్, నేడు 8 మంది ఉద్యోగులతో రోజుకు 800 వడాపావ్‌లను విక్రయిస్తూ, నెలకు రూ. 2 లక్షల వరకు సంపాదిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. గౌరవ్ సాధించిన ఈ విజయం చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
