బెంగళూరులోని ప్రముఖ సంస్థ అయిన స్విగ్గీ (Swiggy) లో పనిచేస్తున్న 31 ఏళ్ల యువకుడికి నెలకు సుమారు 3 లక్షల రూపాయల వరకు చేతినిండా జీతం వస్తోంది.
5 అడుగుల 9 అంగుళాల ఎత్తు, చక్కటి రూపం కలిగిన ఈ యువకుడు గత రెండేళ్లుగా పెళ్లి కోసం సంబంధాలు చూస్తున్నాడు. అయితే ఎంత వెతికినా ఇతనికి తగిన జోడీ మాత్రం కుదరడం లేదు. చివరికి నెలకు 50 వేల రూపాయలు మాత్రమే సంపాదించే యువతులు కూడా ఇతనిని పెళ్లికి నిరాకరించినట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని ఆ యువకుడి స్నేహితుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) లో పంచుకుంటూ, “పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లు (అరేంజ్డ్ మ్యారేజెస్) ఒక పెద్ద మోసం” అని పోస్ట్ చేశాడు. దాంతో ఈ అంశం కాస్తా ఇంటర్నెట్‌లో దావానలంలా వ్యాపించి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆ స్నేహితుడు షేర్ చేసిన వాట్సాప్ చాట్‌లో.. ఒక యువతి సదరు యువకుడితో, “మన ఇద్దరి కుటుంబ నేపథ్యం, జీవన శైలి చాలా భిన్నంగా ఉన్నాయి. కాబట్టి మనం సరితూగలేం. ఈ సంబంధం చర్చలను ఇక్కడితో ముగించడం మంచిది, మీ భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్” అంటూ ఎంతో హుందాగా తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో భారీ జీతం అందుకుంటున్న యువకుడిని, సాధారణ జీతం తీసుకునే యువతి ఇంత సులువుగా రిజెక్ట్ చేయడం సోషల్ మీడియాలో పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్న యువకులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ ఘటనపై నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “అమ్మాయిలకు కేవలం డబ్బే ముఖ్యం కాదు; మంచి గుణం, ఆలోచనలు, ఇద్దరి మధ్య సరైన అవగాహన ఉండటం అత్యంత ముఖ్యం” అని కొందరు ఆ యువతి నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు.

Leave a Reply