బీహార్లోని సివాన్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆటోలో నడుపుతున్న ఒక టీకొట్టు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ దుకాణం బోర్డుపై రాసి ఉన్న ‘పేపర్ లీకేజీ ప్రభావం’ (Effect of Paper Leak) అనే వాక్యం.. డాక్టర్ కావాలనే కలతో పోరాడుతున్న ఒక విద్యార్థిని విషాద గాథను కళ్లకు కడుతోంది.
సివాన్కు చెందిన రైతు కూతురు సుప్రియా రాజ్, పాట్నాలో ఉంటూ నీట్ (NEET) పరీక్ష కోసం ఎంతో కష్టపడి చదివింది. 2025లో జరిగిన పరీక్షను ఆమె బాగా రాసినప్పటికీ, అనూహ్యంగా పేపర్ లీక్ వ్యవహారం బయటపడటంతో ఆ పరీక్ష రద్దయింది. ఆ తర్వాత నిర్వహించిన రీ-ఎగ్జామ్లో ఆమె ఉత్తీర్ణత సాధించలేకపోయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించకపోవడంతో పాట్నాను వదిలి సొంతూరుకు తిరిగి రావాల్సి వచ్చింది.
అయినప్పటికీ, డాక్టర్ కావాలనే తన కలను సుప్రియ వదులుకోలేదు. బంధువులు, స్నేహితుల సహాయంతో ఒక పాత ఆటోను చిన్న టీ, స్నాక్స్ బండిగా మార్చింది. ఉదయం నుంచే ఆటో దగ్గర టీ, బ్రెడ్ పకోడా వంటివి అమ్ముతూ వస్తున్న తన సొంత సంపాదనతోనే ఆన్లైన్ ద్వారా నీట్ పరీక్షకు మళ్లీ సన్నద్ధమవుతోంది.
కఠోర శ్రమ ద్వారా వచ్చే ఆదాయంతో డాక్టర్ కలను నిజం చేసుకునేందుకు సుప్రియ చేస్తున్న పోరాటం, ఎన్ని సవాళ్లు ఎదురైనా లక్ష్యం వైపు పరుగెడుతున్న ఆమె పట్టుదల చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవడంతో పాటు ఆమెను అభినందిస్తున్నారు.

Leave a Reply