ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఓ మోడల్ వైన్ షాపులో, పసి ప్రాయం కూడా దాటని ఓ చిన్నారికి మద్యం విక్రయించడం చూసి దిగ్భ్రాంతికి గురైన ఓ కస్టమర్ నిలదీయగా.. “డబ్బులు ఎవరిచ్చినా సరే, అది చిన్నపిల్లాడైనా పెద్దవాడైనా… ఎవరికైనా ఇక్కడ మద్యం దొరుకుతుంది” అంటూ సదరు సేల్స్‌మెన్ అత్యంత పొగరుగా, బరితెగించి సమాధానమిచ్చిన ఉదంతం తీవ్ర కలకలం రేపింది.
ఘటన జరిగిన రోజు ఆ మద్యం దుకాణానికి వెళ్లిన ఓ వ్యక్తి, అక్కడ పసివయసున్న బాలుడు మద్యం సీసాలు కొనుగోలు చేసుకుని వెళ్లడం చూసి విస్తుపోయాడు. వెంటనే ఆ సేల్స్‌మెన్ వద్దకు వెళ్లి, “ఇంత చిన్న పిల్లలకు మద్యాన్ని ఎలా అమ్ముతారు? ఇది చట్టరీత్యా నేరం కాదా?” అంటూ సూటిగా నిలదీశాడు.
దానికి ఏమాత్రం బెరుకు లేకుండా సమాధానమిచ్చిన ఆ సేల్స్‌మెన్.. కేవలం డబ్బు కోసమే చిన్నారుల భవిష్యత్తును నాశనం చేసేలా, విచక్షణ మరిచి మాట్లాడిన తీరు అక్కడున్న వారిని నిర్ఘాంతపరిచింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆ కస్టమర్ తన సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
మైనర్లకు మద్యం అమ్మడం చట్టప్రకారం తీవ్రమైన నేరమని, కేవలం కాసుల కక్కుర్తితో యువతరాన్ని నాశనం చేస్తున్న ఇలాంటి మద్యం దుకాణ నిర్వాహకులు, యాజమాన్యంపై ఎక్సైజ్ శాఖ, పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేయాలని స్థానికులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో డిమాండ్ చేస్తున్నారు.
