గూగుల్ వంటి దిగ్గజ సంస్థలో మంచి జీతం, వరుస పదోన్నతులు మరియు అద్భుతమైన సౌకర్యాలతో పనిచేస్తున్న సారా విల్సిన్స్కా అనే మహిళ, తన విలాసవంతమైన కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఫుల్‌టైమ్ చిత్రకారిణిగా మారిన స్ఫూర్తిదాయక కథ ఇది.
కరోనా మహమ్మారి సమయంలో శాన్ డియాగోకు మారిన సారా, అక్కడ ప్రకృతి ఒడిలో ప్రశాంతతను వెతుక్కుంటూ తన బిజీ లైఫ్‌ను మొదటిసారిగా తగ్గించుకుంది. కాగితంపై ఆమె పని అద్భుతంగా కనిపిస్తున్నప్పటికీ, తన మనసులో ఏదో తెలియని శూన్యం ఉందని గ్రహించిన ఆమె, ఏ మాత్రం ఆలోచించకుండా గూగుల్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పింది.
ఆ తర్వాత 2023లో తన భాగస్వామితో కలిసి థాయ్‌లాండ్‌లోని ‘కో తావ్’ (Koh Tao) అనే చిన్న ద్వీపానికి వెళ్ళింది. అక్కడ ఎలాంటి ప్రణాళికలు లేకుండా గడిపిన ఖాళీ సమయంలో, ఎటువంటి అధికారిక శిక్షణ లేకపోయినా మొదటిసారిగా వాటర్ కలర్ పెయింటింగ్స్ వేయడం ప్రారంభించింది.
ఆ ద్వీపంలోని అందమైన వీధులు, దుకాణాలు మరియు ప్రకృతి దృశ్యాలను ఆమె గీసి, స్థానిక ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేయగా.. ప్రజలు వాటిని ఎంతగానో మెచ్చుకుని, డబ్బులు ఇచ్చి మరీ కొనుగోలు చేయడం ప్రారంభించారు. దీనితో ఎంతో ఉత్సాహపడిన సారా, తిరిగి అమెరికా వచ్చి ‘స్విల్ ఆర్ట్స్’ (Swill Arts) పేరుతో సొంతంగా పెయింటింగ్ స్టూడియోను ప్రారంభించి విజయవంతంగా నడుపుతోంది.
ప్రస్తుతం తను సంపాదిస్తున్న ఆదాయం గూగుల్‌లో వచ్చిన దానికంటే తక్కువే అయినా, తన కళ ఎంతో మంది మనసులను తాకడమే అసలైన విజయం అని ఆమె ఎంతో సంతోషంగా చెబుతోంది.
