రాజ్‌కోట్‌లో ఒక డాక్టర్ తన క్లినిక్‌లో రహస్య కెమెరాలు అమర్చి, సుమారు 3000 వీడియోలను సేకరించి భారీ వసూళ్లకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడైన డాక్టర్, క్లినిక్ యజమానినే బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ వీడియోలను కొంతమంది విలేకరులకు కూడా అందజేయడంతో, వారు కూడా క్లినిక్ యజమానిపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు.
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సదరు డాక్టర్ మరియు మరో 12 మందిపై బలవంతపు వసూళ్లు, నేరపూరిత కుట్ర, ప్రాణాపాయ బెదిరింపులు మరియు ఐటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. క్రైమ్ డీసీపీ జగదీష్ బంగర్వా తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు డాక్టర్ కమల్ నంధా (BHMS పట్టభద్రుడు) క్లినిక్‌లోని బల్బ్ హోల్డర్‌లో ఒక స్పై కెమెరాను అమర్చాడు. ఆ కెమెరాలోని మెమరీ కార్డులో వీడియోలు రికార్డ్ అయ్యేవి. అవకాశం దొరికినప్పుడల్లా అతను మెమరీ కార్డులను మారుస్తూ ఉండేవాడు.
2023 నుండి డాక్టర్ కమల్ ఈ స్పై కెమెరా ద్వారా సుమారు 3000 నుండి 4000 వీడియోలను సేకరించినట్లు విచారణలో తేలింది. ఫిర్యాదుదారుడైన డాక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. అతని వ్యక్తిగత క్షణాలను కూడా రికార్డ్ చేసి, సత్య గర్జన న్యూస్, భారత్ టైమ్స్, రాజ్‌కోట్ హెడ్ లైన్స్ వంటి వివిధ వార్తా సంస్థలకు చెందిన విలేకరులకు పంపాడు.
అసలు ఏం జరిగింది? సాధు వాస్వాని రోడ్డులోని ‘గౌతమ్ క్లినిక్’లో పని చేసే డాక్టర్ కమల్, క్లినిక్ లేబర్ రూమ్‌లోని బల్బ్ హోల్డర్‌లో కెమెరా బిగించాడు. లైట్ వేసిన ప్రతిసారీ కెమెరా ఆటోమేటిక్‌గా రికార్డింగ్ ప్రారంభించేది. నిందితుడు ఒక మహిళా డాక్టర్‌ను ఏకపక్షంగా ప్రేమించాడని, ఆమెను గమనించడానికే కెమెరా పెట్టాడని విచారణలో తెలిసింది. అయితే ఆ తర్వాత క్లినిక్ యజమాని వ్యక్తిగత దృశ్యాలను, రోగులకు ఇంజెక్షన్లు ఇచ్చే వీడియోలను రికార్డ్ చేసి బ్లాక్‌మెయిలింగ్ ప్లాన్ చేశాడు.
నకిలీ విలేకరులతో కుమ్మక్కు: డాక్టర్ కమల్ ఈ వీడియోలను కొంతమంది విలేకరులతో పంచుకున్నాడు. వారంతా కలిసి డాక్టర్‌ను బద్నాం చేస్తామని బెదిరిస్తూ ₹25 లక్షలు డిమాండ్ చేశారు. భయపడిన డాక్టర్ మొదట ₹50 వేలు చెల్లించాడు. జూన్ 2024 నుండి ఈ వేధింపులు కొనసాగుతున్నాయి. ఇటీవల వేధింపులు మితిమీరడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు నిందితుల నుండి 3000కు పైగా వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.
