మహారాష్ట్రలోని చంద్రపూర్-బల్లార్పూర్ బైపాస్ రోడ్డులో డీజిల్‌తో వెళ్తున్న ట్యాంకర్ అకస్మాత్తుగా బోల్తా పడటంతో తీవ్ర కలకలం రేగింది.
సోమవారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో కామ్‌గార్ చౌక్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ట్యాంకర్ బోల్తా పడటంతో అందులోని భారీ పరిమాణంలో డీజిల్ రోడ్డుపై ఏరులై పారడం మొదలైంది. దీంతో ఆ ప్రాంతమంతా ఇంధనం వ్యాపించడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
రోడ్డుపై డీజిల్ ప్రవహిస్తోందని తెలియగానే పెద్ద సంఖ్యలో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొందరు బకెట్లు, క్యాన్లతో వచ్చి రోడ్డుపై పారుతున్న డీజిల్‌ను ఒడిసిపట్టేందుకు ఎగబడ్డారు. ఇప్పటికే ప్రమాదకరమైన మండే ఇంధనం రోడ్డంతా విస్తరించి ఉండగా, ప్రజలు ఇలా గుంపులుగా ఎగబడటం మరింత ప్రమాదకర పరిస్థితులకు దారితీసింది. అక్కడ చిన్న నిప్పురవ్వ పడినా భారీ అగ్నిప్రమాదం జరిగి ఉండేదని పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే చంద్రపూర్ నగర పోలీసులు, రామ్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుగా అక్కడ గుమిగూడిన ప్రజలను చెదరగొట్టిన పోలీసులు, రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రించారు. అనంతరం ప్రమాద స్థలాన్ని సురక్షిత ప్రాంతంగా మార్చేందుకు తగిన చర్యలు చేపట్టారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
ట్యాంకర్ బోల్తా పడటంతో చంద్రపూర్-బల్లార్పూర్ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పోలీసులు బందోబస్తు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి రోడ్డుపై డీజిల్ ప్రవహించడం, దానిని తీసుకెళ్లడానికి స్థానికులు బకెట్లతో ఎగబడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply