చెన్నై క్రోమ్పేట సుందరమ్మాళ్ కాలనీకి చెందిన 53 ఏళ్ల ఓ ప్రైవేట్ సంస్థ మాజీ ఉన్నతాధికారికి.. డేటింగ్ యాప్ ద్వారా గుజరాత్ రాష్ట్రానికి చెందిన కంచన్ లతా సింగ్ (48) అనే మహిళతో పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత వాట్సాప్లో వీరి పరిచయం కాస్తా సన్నిహితంగా మారడంతో.. గత ఆగస్టు 26న ఆలందూరులోని ఓ లగ్జరీ హోటల్కు రావాలంటూ ఆ మహిళ తన స్నేహితురాలితో కలిసి సదరు వ్యక్తిని ఆహ్వానించింది.
అక్కడికి వెళ్లిన ఆ మాజీ అధికారి.. ఆ ఇద్దరు మహిళలతో కలిసి మద్యం సేవించాడు. మద్యం మత్తు ఎక్కువగా కావడంతో అతడు స్పృహతప్పి నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి మెలకువ వచ్చి చూసేసరికి, అక్కడ ఉండాల్సిన ఇద్దరు మహిళలు అప్పటికే అక్కడి నుంచి ఉడాయించారు. అంతేకాకుండా, అతడి మెడలో ఉన్న 2 సవర్ల బంగారు గొలుసు, ₹4,000 నగదును ఆ మహిళలు చోరీ చేసినట్లు గుర్తించాడు.
ఈ ఘటనపై బాధితుడు సెయింట్ థామస్ మౌంట్ (పరంగిమలై) క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందం వెంటనే బెంగళూరుకు వెళ్లి కంచన్ లతా సింగ్ను అదుపులోకి తీసుకుని చెన్నైకి తరలించింది. పోలీసుల విచారణలో.. ఈమె దేశవ్యాప్తంగా పలు నగరాల్లో డేటింగ్ యాప్ల ద్వారా మగవారికి వలపు వల విసిరి లగ్జరీ హోటళ్లకు రప్పించి, మత్తుమందు/మద్యం ఇచ్చి నగలు, నగదు దోచుకునే ఘరానా లేడీ అని బట్టబయలైంది. కోర్టులో హాజరుపరిచిన అనంతరం నిందితురాలిని రిమాండ్కు తరలించగా, పరారీలో ఉన్న మరో మహిళ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
