డొనాల్డ్ ట్రంప్: మేము సముద్రపు దొంగలలాంటి వాళ్ళం… ఇరాన్‌పై చర్య గురించి ట్రంప్ ఏమన్నారు?

హోర్ముజ్ జలసంధిలోని ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో, అమెరికా నావికాదళం చేస్తున్న చర్యలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.

ఇరాన్ నౌకలను స్వాధీనం చేసుకునే అమెరికా చర్యలను ఆయన ‘సముద్రపు దొంగల (Pirates) పని’తో పోల్చారు. ఫ్లోరిడాలో జరిగిన ఒక ర్యాలీలో ట్రంప్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

“మేము సముద్రపు దొంగల లాంటి వారం, కానీ జోక్ చేయడం లేదు”
ర్యాలీలో ట్రంప్ ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు మరియు నౌకల జప్తు ప్రక్రియ గురించి వివరిస్తూ.. “మేము ఓడపైకి వెళ్తాము, దానిని మా నియంత్రణలోకి తీసుకుంటాము. ఓడ, అందులోని సరుకు, చమురు.. అన్నింటినీ మేము జప్తు చేస్తాము. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం” అని అన్నారు. ఆ వెంటనే, “మేము ఒక రకంగా సముద్రపు దొంగల వంటి వారం, కానీ మేము జోక్ చేయడం లేదు” అని వ్యాఖ్యానించారు.

అమెరికా సైన్యం ఇటీవల ఇరాన్ చమురును తీసుకెళ్తున్న రెండు ట్యాంకర్లను అడ్డుకున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అమెరికా చేస్తున్నది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని, ఇది సముద్రంపై ‘ఆయుధాల బలంతో చేస్తున్న దోపిడీ’ అని ఇరాన్ మండిపడుతోంది. “ప్రపంచం మరోసారి సముద్రపు దొంగల పునరాగమనాన్ని చూస్తోంది” అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ విమర్శించారు.

45 నౌకలను వెనక్కి పంపిన అమెరికా
ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుండి హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను ఇరాన్ నిలిపివేసింది. దీనికి ప్రతిచర్యగా ట్రంప్ ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు విధించారు. శుక్రవారం నాటి గణాంకాల ప్రకారం, అమెరికా సెంట్రల్ కమాండ్ ఆంక్షలను ఉల్లంఘించిన 45 నౌకలను వెనక్కి పంపింది. ఇరాన్ ఓడరేవులకు వెళ్లే లేదా అక్కడి నుండి వచ్చే అన్ని నౌకలపై ఈ నిషేధం వర్తిస్తుందని జనరల్ డాన్ కేన్ స్పష్టం చేశారు. వాషింగ్టన్ తమ ఓడరేవులపై ఆంక్షలు తొలగించే వరకు హోర్ముజ్ జలసంధిపై తమ పట్టు సడలించబోమని ఇరాన్ కూడా తెగేసి చెప్పింది.


Posted

in

by

Tags: