తేహ్రాన్/బీజింగ్: గల్ఫ్ యుద్ధ రంగం నుంచి ఒక సంచలన వార్త వెలువడింది. అసలు తాత్కాలిక యుద్ధ విరామమే వద్దని భీష్మించుకు కూర్చున్న ఇరాన్, హఠాత్తుగా ఎందుకు వెనక్కి తగ్గింది? డొనాల్డ్ ట్రంప్ డెడ్‌లైన్‌కు లొంగని ఇరాన్, రెండు వారాల సంధికి ఎందుకు ‘ఓకే’ చెప్పింది? ఈ అంతర్జాతీయ డ్రామా వెనుక చైనా పంపిన ఒకే ఒక్క ‘మెసేజ్’ పని చేసిందని తాజా సమాచారం.
సంధికి ససేమిరా అన్న ఇరాన్.. సీన్ ఎలా మారింది?
గత నెల రోజులుగా ఇరాన్‌పై అమెరికా తీవ్ర ఒత్తిడి తెస్తోంది. పాకిస్థాన్ ద్వారా సంధి ప్రపోజల్ పంపినా “తాత్కాలికం వద్దు.. శాశ్వత పరిష్కారం కావాలి” అని ఇరాన్ మొండికేసింది. కానీ, అనూహ్యంగా రెండు వారాల పాటు దాడులు ఆపేందుకు, అలాగే అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది.
రంగంలోకి దిగిన చైనా.. తెర వెనుక కథ ఇదే!
ఇరాన్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ప్రధాన కారణం చైనా జోక్యమేనని ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం వెల్లడించింది.
- చైనా ఒత్తిడి: ఇరాన్‌కు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన చైనా, ఈ యుద్ధం వల్ల తమ వాణిజ్యం దెబ్బతింటోందని భావించింది. ఉద్రిక్తతలు తగ్గించి, కొంత ‘ఫ్లెక్సిబిలిటీ’ చూపాలని ఇరాన్‌ను చైనా గట్టిగా కోరినట్లు ముగ్గురు ఇరాన్ ఉన్నతాధికారులు ధృవీకరించారు.
- సుప్రీం లీడర్ గ్రీన్ సిగ్నల్: చైనా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ‘మోజ్తబా ఖమేనీ’, పాకిస్థాన్ ప్రతిపాదించిన రెండు వారాల యుద్ధ విరామానికి ఆమోదం తెలిపారు.
ట్రంప్ ‘వార్నింగ్’.. ఆపై అద్భుతం!
యుద్ధ విరామం ప్రకటించడానికి కొన్ని గంటల ముందే డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆఖరి హెచ్చరిక చేశారు. “ఈ రాత్రికి ఒప్పందం కుదరకపోతే ఒక నాగరికత అంతమైపోతుంది.. ఆ తర్వాత దాన్ని ఎవరూ తీసుకురాలేరు. అదే సమయంలో ఏదైనా అద్భుతం జరిగి యుద్ధం ఆగిపోవచ్చు” అని ట్రంప్ పేర్కొన్నారు. ఆయన అన్నట్టుగానే చైనా రూపంలో ఆ ‘అద్భుతం’ జరిగి యుద్ధానికి తాత్కాలిక విరామం లభించింది.
