“తప్పు చేసినా వీడియో తీసి మరీ నిలదీయాలా?”.. విమానాశ్రయంలో సహాయకురాలిపై విరుచుకుపడ్డ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్.. నెట్టింట వైరలవుతున్న వీడియో..!!

ప్రముఖ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ లీనా భూషణ్ ఎయిర్‌పోర్టులో తన సహాయకురాలిని మందలిస్తూ తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాశ్మీర్ విమానాశ్రయం నుంచి తన బృందంతో కలిసి ప్రయాణమవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదటిసారి విమాన ప్రయాణం చేస్తున్న మెహక్ అనే తన సహాయకురాలిపై లీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘బ్యాటరీలను హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టకుండా చెక్-ఇన్ లగేజీలో ఎందుకు పెట్టావు? నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్లిపోనా?’ అంటూ ఆమెను గద్దిస్తూ వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. బహిరంగ ప్రదేశంలో ఒక ఉద్యోగినిని అధికార దర్పంతో అవమానించేలా ప్రవర్తించినందుకు నెటిజన్లు లీనా భూషణ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ వివాదంపై లీనా భూషణ్ స్పందిస్తూ వివరణ ఇచ్చింది. కాశ్మీర్ విమానాశ్రయం అత్యంత భద్రతా ప్రాంతమని, లగేజీలో నిబంధనలకు విరుద్ధంగా బ్యాటరీలు, లైటర్ ఉండటాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది తమను ఆపి విచారించారని తెలిపింది.

ఆ ఉద్రిక్తత, ఆందోళనలోనే కోపంతో సహాయకురాలిని మందలించానని, అంతేకానీ తన సిబ్బందిని ఎప్పుడూ కించపరిచే మనస్తత్వం తనకు లేదని చెప్పుకొచ్చింది. అయినప్పటికీ, పొరపాటు జరిగితే అంతర్గతంగా సరిదిద్దాల్సింది పోయి, పబ్లిక్‌గా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం ముమ్మాటికీ ముమ్మాటికీ తప్పేనంటూ నెటిజన్లు ఆమె వైఖరిని తప్పుబడుతున్నారు.


Posted

in

by

Tags: