శివగంగై జిల్లా మానామదురై సమీపంలోని చిన్న పుదుక్కోట్టై ప్రాంతంలో ప్రేమ వ్యవహారంలో తలెత్తిన ఘర్షణలో 35 ఏళ్ల మోస్ట్ వాంటెడ్ రౌడీ శివబాలన్ అనే వ్యక్తిని యువతి తండ్రి నరికి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
రౌడీ శివబాలన్ అదే ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమించినట్లు తెలుస్తోంది. అయితే వీరి ప్రేమను ఆ యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా, ఆ యువతి తమ్ముడు ఈ ప్రేమను గట్టిగా వ్యతిరేకిస్తూ వచ్చాడు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రౌడీ శివబాలన్, తమ ప్రేమకు అడ్డుపడుతున్న యువతి తమ్ముడిపై దాడి చేసి చంపేందుకు కత్తితో వారి ఇంటి వైపు బయలుదేరాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి, దారిలోనే రౌడీ శివబాలన్ను అడ్డుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం, పెనుగులాట చోటుచేసుకోగా, యువతి తండ్రి తన వద్ద ఉన్న ఆయుధంతో శివబాలన్పై విచక్షణారహితంగా దాడి చేసి నరికాడు.
ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన రౌడీ శివబాలన్ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శివబాలన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యోదంతంపై కేసు నమోదు చేసి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply