ఆస్ట్రేలియా: పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్ వాడటం, ముఖ్యంగా సోషల్ మీడియాలో ‘రీల్స్’ చూడటం వల్ల వారి మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ విశ్వవిద్యాలయం జరిపిన తాజా పరిశోధన హెచ్చరిస్తోంది.
సుమారు 7,000 మంది పిల్లలపై జరిపిన ఈ పరిశోధన ఫలితాలు ప్రముఖ సైకాలజికల్ బులెటిన్ (Psychological Bulletin) జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనంలో వెల్లడైన కొన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు ఇవే:
మెదడుకు ‘జంక్ ఫుడ్’ లాంటిది: మొబైల్ స్క్రీన్‌ను అతిగా చూడటం అనేది శరీరానికి ‘జంక్ ఫుడ్’ ఎంతటి కీడు చేస్తుందో, పిల్లల మనస్సుకు మరియు మెదడుకు అంతటి ప్రమాదాన్ని కలిగిస్తుందని పరిశోధకులు గుర్తించారు. చిన్న వయసులోనే మొబైల్ ఫోన్లకు బానిసలయ్యే పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గడం, కార్యదక్షత లోపించడం మరియు నేర్చుకునే సామర్థ్యం దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతున్నాయి.
సృజనాత్మకతకు గొడ్డలిపెట్టు: హోం వర్క్ చేసేటప్పుడు లేదా చదువుకునేటప్పుడు మొబైల్ వాడటం వల్ల పిల్లల్లో కొత్త విషయాలను అన్వేషించాలనే ఆసక్తి తగ్గిపోతుంది. ఇది వారిని యంత్రాల్లా మార్చివేస్తుంది తప్ప, సొంతంగా ఆలోచించే శక్తిని (Self-thinking) మందగింపజేస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో వారు స్వయంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒంటరితనం మరియు సామాజిక దూరం: ఫోన్లతోనే ఎక్కువ సమయం గడిపే పిల్లలు సమాజం నుండి వేరుపడి, ఇతరులతో మాట్లాడటానికి ఇష్టపడని ‘ఇంట్రోవర్ట్’ (Introvert) స్థితికి చేరుకుంటున్నారు. ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గడం వల్ల భవిష్యత్తులో వారు ఉద్యోగ రీత్యా మరియు వ్యక్తిగత సంబంధాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
నిపుణుల సూచన: పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అత్యవసరమైతే తప్ప వారి చేతికి మొబైల్ ఇవ్వకండి. వారి మొబైల్ అలవాట్లను ఇప్పుడే నియంత్రించడం చాలా అవసరం.
