తల్లిపాల రంగు ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. సమయం, తల్లి తీసుకునే ఆహారం మరియు శరీరంలో వచ్చే మార్పులను బట్టి తల్లిపాల రంగులో మార్పులు రావడం సహజం.
ఈ రంగు మార్పులు సాధారణమైనవేనా, ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి అనే విషయాలపై ప్రముఖ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ నిపుణురాలు డాక్టర్ పి. ప్రియదర్శిని సమగ్ర వివరణ ఇచ్చారు.
శిశువు పుట్టిన మొదటి కొన్ని రోజులు వచ్చే పాలను ‘కొలొస్ట్రమ్’ (ముర్రుపాలు) అంటారు. ఇందులో రోగనిరోధక శక్తి, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందులోని కెరోటినాయిడ్స్ కారణంగా ఈ పాలు సాధారణంగా పసుపు లేదా బంగారు-పసుపు రంగులో ఉంటాయి. రోజులు గడిచేకొద్దీ అవి సాధారణ తల్లిపాలుగా మారుతాయి. పాలిచ్చే సమయంలో మొదట్లో వచ్చే పాలు పలచగా నీళ్లలా ఉండి, చివర్లో వచ్చే పాలు చిక్కగా క్రీమ్‌లా మారడం పూర్తిగా సహజమైన ప్రక్రియ.
తల్లులు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా పాల రంగు తాత్కాలికంగా మారే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఆకుకూరలు ఎక్కువగా తింటే లేత ఆకుపచ్చ రంగులోను, బీట్రూట్ వంటి కూరగాయలు లేదా కృత్రిమ రంగులు వాడినప్పుడు గులాబీ రంగులోనూ పాలు మారవచ్చు. చనుమొనలపై చిన్నపాటి గాయాలు లేదా పగుళ్లు ఏర్పడినప్పుడు పాలతో స్వల్పంగా రక్తం కలిసి గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారవచ్చు. దీనికి వెంటనే తీవ్రంగా భయపడాల్సిన అవసరం లేనప్పటికీ, జాగ్రత్తగా గమనిస్తుండాలి.
ఆహారపు అలవాట్ల వల్ల పాల రంగు మారితే పాలివ్వడం ఆపాల్సిన అవసరం లేదు. అయితే, పాలు నిరంతరం ఎరుపు లేదా గులాబీ రంగులోనే వస్తూ.. దాంతో పాటు రొమ్ములో తీవ్రమైన నొప్పి, ఎర్రటి దద్దుర్లు, వేడిగా ఉండటం, జ్వరం మరియు వణుకు వంటి లక్షణాలు కనిపిస్తే అది ఇన్ఫెక్షన్ (రొమ్ము ఇన్ఫెక్షన్) అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో సొంత వైద్యం చేసుకోకుండా, వెంటనే గైనకాలజిస్ట్ లేదా పీడియాట్రీషియన్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఎంతో అవసరం.
