ముంబై/మహారాష్ట్ర:కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక కిరాతకుడు.. ఒక మహిళ ఆత్మగౌరవాన్ని బజారున పడేశాడు. ఆమెతో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని రికార్డు చేసిన వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా, ఏకంగా ఆమె కన్నకొడుకు మొబైల్ ఫోన్‌కే ఆ నగ్న వీడియోలను పంపి రాక్షసానందం పొందాడు. కళ్లెదుట తల్లి అంతరంగ వీడియోలు చూసి ఆ కొడుకు నిర్ఘాంతపోగా.. కన్నబిడ్డ ముందే తల ఎత్తుకోలేక, ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ తల్లి రైలు కింద పడి తనువు చాలించింది.
అసలేం జరిగిందంటే?
మహారాష్ట్రలోని కబ్రాయ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల మహిళ ఒక కాంట్రాక్టర్ వద్ద భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తోంది. అక్కడ ఆమెతో పాటు పనిచేసే కళ్యాణ్ ప్రజాపతి అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకున్న కళ్యాణ్.. ఆమెకు తెలియకుండా కొన్ని వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను తన మొబైల్లో చిత్రీకరించాడు.
బ్లాక్ మెయిల్.. ఆపై సోషల్ మీడియాలో రచ్చ!
ఆ వీడియోలను చూపించి కళ్యాణ్, సదరు కాంట్రాక్టర్ కుమారులు కలిసి ఆ మహిళను వేధించడం మొదలుపెట్టారు. తన వద్దకే పనికి రావాలని, లేదంటే వీడియోలు బయట పెడతామని కళ్యాణ్ బెదిరించాడు. వారి వేధింపులు భరించలేక ఆమె పనికి వెళ్లడం మానేసింది. దీంతో కక్ష పెంచుకున్న కళ్యాణ్, గత మార్చి 16న ఆ మహిళా కార్మికురాలి వ్యక్తిగత వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశాడు. అంతటితో ఆగక, ఆ వీడియోలను నేరుగా ఆమె కుమారుడి వాట్సాప్ నంబర్‌కు పంపాడు.
రైలు కింద పడి బలవన్మరణం..
సమాజంలో పరువు పోవడమే కాకుండా, కన్నకొడుకే తన వీడియోలను చూడటంతో ఆ తల్లి మనస్తాపానికి గురైంది. ఆ నరకయాతనను భరించలేక మార్చి 17 తెల్లవారుజామున బారిపురా రైల్వే స్టేషన్ సమీపంలో వేగంగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఆమె భర్త ఏప్రిల్ 5న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వేట..
ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు కళ్యాణ్ ప్రజాపతితో పాటు అతనికి సహకరించిన వారిపై పోలీసులు ఐటీ చట్టం మరియు ఆత్మహత్యకు ప్రేరేపించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుల కోసం గాలిస్తున్నారు.
