రాజస్థాన్ రాష్ట్రం సవాయ్ మాధోపూర్ జిల్లాలో, ఇంటి వరండాలో తల్లి పక్కన నిద్రిస్తున్న రెండేళ్ల ఆడబిడ్డను అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
సుమారు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటి ప్రాంగణంలోకి చొరబడిన ఆ దుండగుడు, నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు సమాచారం. నిద్రలేచిన చిన్నారి తల్లి.. ఆ దుండగుడు పాపను ఎత్తుకుని పారిపోతుండటాన్ని గమనించింది. వెంటనే ఆమె, అక్కడే నిద్రిస్తున్న ఇతర మహిళలు భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగుడు, పాప తల్లికి చెందిన మొబైల్ ఫోన్ను కూడా ఎత్తుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారిని రక్షించేందుకు ఆ ప్రాంతమంతటా తక్షణమే నాకాబందీ (దిగ్బంధనం) ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులతో పాటు గ్రామస్తులు కూడా కలిసి సమీప ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. దీంతో ఆ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ తీవ్ర ఉద్రిక్తత, ఆందోళన నెలకొంది.
ముమ్మర గాలింపు చర్యల్లో భాగంగా గ్రామం సమీపంలోని నదీ తీరంలో ఉన్న జామ తోటలో సదరు అనుమానితుడు పోలీసులకు చిక్కాడు. అతడి వద్ద నుంచి రెండేళ్ల చిన్నారిని పోలీసులు క్షేమంగా కాపాడారు. పాప సురక్షితంగా దొరకడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, నిందితుడిని పట్టుకున్న గ్రామస్తులు అతడిపై దేహశుద్ధి చేసినట్లు సమాచారం. అనంతరం పోలీసులు అతడిని తమ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ప్రాథమిక విచారణలో ఆ దుండగుడు దొంగతనం చేసే ఉద్దేశంతోనే ఇంట్లోకి చొరబడి ఉండవచ్చని గ్రామస్తులు తెలిపారు. అయితే సెల్ఫోన్ ఎత్తుకెళ్లడంతో పాటు చిన్నారిని కూడా ఎందుకు అపహరించాడు అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. పాపను కిడ్నాప్ చేయడానికి మరేదైనా కారణం ఉందా, ఈ నేరంలో ఇంకెవరికైనా సంబంధం ఉందా అనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. చిన్నారి క్షేమంగా రక్షించబడటంతో, అరెస్టయిన నిందితుడిని పోలీసులు విస్తృతంగా ప్రశ్నిస్తున్నారు.
