దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరానికి వెళ్తున్న ఫ్లైదుబాయ్ (Flydubai) విమానంలో, గగనతలంలో అకస్మాత్తుగా జరిగిన ఓ భయంకరమైన దాడి అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
విమానం గాలిలో ఎగురుతున్న సమయంలో, అకస్మాత్తుగా కాక్‌పిట్ (విమాన నియంత్రణ గది) లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి.. భారత సంతతికి చెందిన చీఫ్ పైలట్ స్మిత్ మచార్‌పై అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేశాడు.
ఊహించని ఈ ఆకస్మిక దాడిలో పైలట్ శరీరమంతా తీవ్ర గాయాలై, కాక్‌పిట్ ప్రాంతమంతా రక్తపు మడుగులా మారిన దృశ్యం విమానంలో ఉన్న వందలాది మంది ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది.
ఈ దాడిలో పైలట్ తల, చేతులపై తీవ్రమైన కత్తిపోట్లు పడ్డాయి. అయితే, అదే విమానంలో ప్రయాణిస్తున్న దంత వైద్యుడు సోడా మోసవ్, ఆ అరుపులు విని వెంటనే ధైర్యంగా కాక్‌పిట్ వద్దకు పరుగెత్తాడు.
అక్కడ పైలట్ స్మిత్ మచార్ తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండటం గమనించిన ఆ డాక్టర్, అక్కడున్న వస్తువులతోనే వెంటనే ప్రాథమిక చికిత్స అందించి రక్తస్రావాన్ని అదుపు చేశాడు.
తీవ్ర గాయాలతో మృత్యువు అంచున ఉన్నప్పటికీ, ఆ పైలట్ ఎంతో సంయమనంతో ఉంటూ విమానాన్ని సురక్షితంగా నడపడానికి ప్రయత్నించడం, దానికి తోడు సరైన సమయానికి డాక్టర్ అందించిన వైద్య సహాయం ఎంతో మంది ప్రాణాలను కాపాడాయి.
ఈలోగా, విమానంలో దాడికి పాల్పడిన వ్యక్తిని ఇతర ప్రయాణికులు, విమాన సిబ్బంది కలిసి అత్యంత సాహసోపేతంగా పట్టుకుని.. హెడ్ఫోన్లు, ప్లాస్టిక్ వైర్లతో బంధించారు.
ఈ అసాధారణ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొన్న విమాన సిబ్బంది, వెంటనే విమానాన్ని దారి మళ్లించి సౌదీ అరేబియాలోని తబుక్ (Tabuk) విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అక్కడ తీవ్రంగా గాయపడిన పైలట్ స్మిత్ మచార్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి తీవ్ర చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారని సమాచారం వెలువడింది.
వాయుమార్గ ప్రయాణాల భద్రతను ప్రశ్నార్థకం చేసిన ఈ భయానక ఘటనలో.. ప్రయాణికుల ఐకమత్యం, డాక్టర్ చూపిన ధైర్యం ఒక పెను ప్రమాదాన్ని నివారించాయి.

Leave a Reply