తల పైనుంచి దూసుకెళ్తున్న క్షిపణులు.. గల్ఫ్ వదలని భారతీయులు! దీని వెనుక ఉన్న హృదయ విదారక వాస్తవం

మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఘర్షణ నేడు ప్రపంచాన్ని ఒక మానవీయ సంక్షోభంలోకి నెట్టింది. ముఖ్యంగా దుబాయ్, సౌదీ అరేబియా, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలు ఈ యుద్ధం వల్ల నేరుగా ప్రభావితమవుతున్నాయి.

ఆకాశంలో క్షిపణులు, డ్రోన్ దాడులతో శాంతి కరువైన ఇలాంటి భయానక వాతావరణంలో.. పాశ్చాత్య దేశాల (బ్రిటిష్, అమెరికన్) పౌరులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి స్వదేశాలకు వెనుదిరిగారు. కానీ, లక్షలాది మంది భారతీయులు మాత్రం ఇంకా అక్కడే తలదాచుకుంటున్నారు. దీనికి కారణం వారి ధైర్యం మాత్రమే కాదు.. ‘ఉద్యోగం పోతుందేమో’ అన్న బతుకు భయం.

గల్ఫ్ దేశాల్లో సుమారు కోటి మంది భారతీయులు పని చేస్తున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు కేవలం 4 లక్షల మంది మాత్రమే భారత్‌కు తిరిగి వచ్చారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులు, విద్యార్థులే తప్ప అక్కడ పని చేసే కార్మికులు కాదు.

భారతీయ కార్మికుల ఆవేదన: ఇరాన్ ఇప్పుడు అమెరికా సైనిక స్థావరాలున్న దుబాయ్, సౌదీ, కువైట్, బహ్రెయిన్ దేశాలపై దృష్టి సారించింది. హోటళ్లు, ఆయిల్ ట్యాంకర్లు, నివాస ప్రాంతాలపై కూడా దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇంత జరుగుతున్నా భారతీయులు ఎందుకు రావడం లేదనేది పెద్ద ప్రశ్న.

రియాద్‌లో పని చేస్తున్న ఫరాజ్ వామిక్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. “మేము ప్రతిరోజూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పని చేస్తున్నాం. కానీ ఇండియా వెళ్తే మాకు ఏ పని దొరుకుతుంది? గతంలో ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ వచ్చే జీతం నా కుటుంబ అవసరాలకు సరిపోలేదు. అందుకే మళ్ళీ వచ్చాను. ఇప్పుడు యుద్ధం వల్ల ఉద్యోగం వదిలి వెళ్తే, మళ్ళీ రావడం అసాధ్యం” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆటోమొబైల్ ఇంజనీర్ మహమ్మద్ అహ్మద్ మాటల్లోనూ ఇదే వేదన వినిపించింది. “నా భార్యాపిల్లలు ఫోన్ చేసి ఏడుస్తూ.. ‘పని ముఖ్యం కాదు, గంజి తాగైనా బతుకుదాం, వచ్చేయండి’ అంటున్నారు. కానీ నేను వెళ్తే నా పిల్లల చదువు ఏమవుతుంది? వారి భవిష్యత్తు కోసం నేను ఇక్కడే పోరాడాలి” అని ఆయన వాపోయారు.

ఆర్థిక మాంద్యం భయం: దుబాయ్‌లోని బ్యాంకులో పనిచేసే సయ్యద్ అక్తర్ హుస్సేన్ మాట్లాడుతూ.. “పెట్టుబడిదారులు తమ డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. నేను ఇండియా వెళ్లి వచ్చేసరికి నా బ్యాంకు ఉంటుందో లేదో తెలియదు. అప్పుడు నేను నడిరోడ్డున పడాల్సి వస్తుంది” అని భయాందోళన వ్యక్తం చేశారు. లక్నోకు చెందిన రషీద్ అలీకి దుబాయ్‌లో ₹2 లక్షల జీతం వస్తోంది. “భారత్‌లో ఏ బ్యాంకు నాకు ఇంత జీతం ఇస్తుంది? నా కుటుంబం ఆకలి తీరాలంటే ఈ యుద్ధ నీడలో బతకడమే మేలు” అని ఆయన పేర్కొన్నారు.

ఏ రంగాలు దెబ్బతిన్నాయి? ముఖ్యంగా హోటల్, పర్యాటక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా మందికి జీతాలు లేకుండానే సెలవుపై పంపారు. యూఏఈలో ఇప్పటికే ఉద్యోగాల కోత, జీతాల తగ్గింపు చర్యలు మొదలయ్యాయి. సుమారు 3 లక్షల మంది భారతీయుల ఉపాధి ప్రమాదంలో పడింది. ఏది ఏమైనా, మరణం కంటే వక్రాన్నే పెద్ద శాపంగా భావించే భారతీయులు.. గల్ఫ్ భవనాల నిర్మాణంలో తమ రక్తాన్ని, చెమటను ధారపోస్తూ అక్కడే పోరాడుతున్నారు.


Posted

in

by

Tags: