ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనశైలి మరియు మానసిక ఒత్తిడి కారణంగా చాలామంది మెడ నొప్పి, తల వెనుక భాగంలో నొప్పిని (Occipital pain) ఎదుర్కొంటున్నారు. ఈ నొప్పులు కేవలం పని ఒత్తిడి వల్లే వస్తున్నాయని మనం అనుకుంటాం. కొన్నిసార్లు నిద్రలేమి, అలసట వల్ల కూడా ఇవి రావచ్చు.
అయితే, ఈ నొప్పిని పదేపదే అనుభవిస్తున్నా లేదా ప్రతిరోజూ బాధపడుతున్నా దానిని సాధారణమైనదిగా భావించి వదిలేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. చాలామంది ఇది ఎముకల అరుగుదల లేదా కండరాల పట్టేయడం వల్ల వస్తుందని అనుకుంటారు, కానీ దీని వెనుక ఉన్న అసలు తీవ్రతను గుర్తించరు.
అధిక రక్తపోటు సంకేతం కావచ్చు: తల మరియు మెడ నొప్పి ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. ముఖ్యంగా ఇది అధిక రక్తపోటు (High Blood Pressure) యొక్క ప్రధాన లక్షణం కావచ్చు. రక్తపోటు సాధారణ స్థాయి కంటే పెరిగినప్పుడు రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి కారణంగా తల వెనుక భాగం మరియు మెడలో నొప్పి వస్తుంది. ఈ నొప్పి క్రమంగా పెరుగుతూ ఎక్కువ సేపు ఉంటుంది.
ఎప్పుడు జాగ్రత్త పడాలి? నొప్పితో పాటు ఈ క్రింది లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలి:
- తరచుగా తల తిరగడం.
- విపరీతమైన అలసట లేదా గుండె వేగంగా కొట్టుకోవడం.
- కంటి చూపు మసకబారడం లేదా వెలుతురును చూడలేకపోవడం.
- జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపడం.
ఈ నొప్పుల నుండి బయటపడటం ఎలా?
- వారానికి రెండుసార్లు మీ రక్తపోటును తనిఖీ చేయించుకోండి.
- ఆహారంలో ఉప్పు (Salt) వాడకాన్ని తగ్గించండి.
- నూనెలో వేయించిన పదార్థాలను (Oily food) నివారించండి.
- ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా మరియు ధ్యానం చేయండి.
- తగినంత సమయం నిద్రపోండి మరియు రోజూ వ్యాయామం చేయండి.
- నొప్పి తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
