ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లాలో కొత్తగా నిర్మించిన రహదారికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అల్లిపూర్ నుంచి హసనాపూర్ సానీ వెళ్లే మార్గంలో కొత్తగా తారు రోడ్డు నిర్మించగా, అది పూర్తయిన 24 గంటల్లోనే గ్రామస్థులు చేతులతో పెకిలించి చూపించారు. నేలపై పరిచిన దుప్పటి లేదా కార్పెట్‌ను ఎత్తినట్లుగా రోడ్డు పైపొరను సులభంగా పైకి లేపిన దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఈ సంఘటన జరిగిన సమయంలో బింద్కీ నియోజకవర్గ ఎమ్మెల్యే జై కుమార్ సింగ్ జైకీ కూడా అక్కడే ఉన్నట్లు తెలిసింది. రహదారి నాణ్యత సరిగా లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన గ్రామస్థులు, కొందరు నేరుగా ఎమ్మెల్యే ముందే తారు రోడ్డును చేతులతో పట్టుకుని పైకి లేపి చూపించారు. ఒకవైపు నుంచి చేత్తో లాగగానే అచ్చం గుడ్డ పరిచినట్లే రోడ్డు పెచ్చులూడి పైకి లేచింది. చిన్న పిల్లలు సైతం చేతులతో రోడ్డును సులభంగా పెకిలిస్తున్న దృశ్యాలు కనిపించడంతో ఈ వీడియో మరింత చర్చనీయాంశంగా మారింది.
ఈ వివాదంపై జిల్లా కలెక్టర్ నిధి గుప్తా వాట్స్ వివరణ ఇచ్చారు. అల్లిపూర్ నుంచి హసనాపూర్ వరకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD) ఆధ్వర్యంలో నిర్మించిన ఈ రహదారిని ఎఫ్డీఆర్ (FDR – Full Depth Reclamation) సాంకేతికతతో వేసినట్లు ఆమె తెలిపారు. కొత్తగా నిర్మించిన ఈ రహదారి దృఢపడటానికి సరైన ‘క్యూరింగ్ సమయం’ (Curing Period) అవసరమని, ఆ సాంకేతికతపై గ్రామస్థులకు తగిన అవగాహన లేకపోవడంతో వారికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అదే సమయంలో, రోడ్డు నిర్మాణ విధుల్లో ఉన్న మహిళా జూనియర్ ఇంజనీర్ పనికి కొందరు ఆటంకం కలిగించినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది. ఈ మొత్తం ఘటనపై సమగ్ర నివేదిక కోరామని, అభివృద్ధి పనులకు ఎవరైనా ఆటంకం కలిగించారా అనే కోణంలో విచారణ జరుపుతామని వెల్లడించారు. రోడ్డు నాణ్యతపై గ్రామస్థుల్లో అప్పటికే అసంతృప్తి నెలకొనగా, చేతులతోనే రోడ్డును పెకలించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి.

Leave a Reply