ఆహారం తిన్న వెంటనే కడుపు ఉబ్బరం (Bloating), గ్యాస్ సమస్య, కడుపులో అసౌకర్యంగా అనిపించడం వంటి ఇబ్బందులు చాలామందిలో కనిపిస్తుంటాయి.
ఆహారాన్ని నమలకుండా వేగంగా మింగేయడం, శరీరానికి పడని పదార్థాలు తినడం, అజీర్ణం వంటి ఎన్నో కారణాల వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి కడుపుబ్బరానికి చెక్ పెట్టేందుకు మన రోజువారీ ఆహారపు అలవాట్లలో కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకుంటే సరిపోతుందని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి సూచిస్తున్నారు.
డాక్టర్ పేర్కొన్న వాటిలో పుదీనా టీ (Peppermint Tea) మరియు సోంపు (Fennel Seeds) అత్యంత ముఖ్యమైనవి. పుదీనాలోని మెంథాల్ జీర్ణవ్యవస్థలోని కండరాలను రిలాక్స్ చేయడానికి తోడ్పడుతుంది. అలాగే, భోజనం చేసిన తర్వాత కాస్త సోంపు నమిలి తింటే కొందరిలో గ్యాస్, కడుపుబ్బరం సమస్యలు గణనీయంగా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో శీతల పానీయాలు, సోడాలు వంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ (Carbonated Drinks) తగ్గించడం చాలా ముఖ్యం. వీటిలోని కార్బన్-డై-ఆక్సైడ్ కడుపులో గ్యాస్ పెరిగిపోయేలా చేసి, త్రేన్పులు మరియు ఉబ్బరాన్ని మరింత పెంచుతుంది. అలాగే శరీరానికి ఫైబర్ (పీచు పదార్థం) ఎంతో అవసరమే అయినప్పటికీ, దాన్ని ఒక్కసారిగా కాకుండా క్రమక్రమంగా ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
అయితే, ఈ వంటింటి చిట్కాలు అందరికీ ఒకేలా ఫలితాన్ని ఇస్తాయని చెప్పలేము. తరచూ కడుపు ఉబ్బరంతో పాటు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, అకస్మాత్తుగా బరువు తగ్గడం లేదా మలంలో రక్తం పడటం వంటి తీవ్రమైన లక్షణాలు ఉంటే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.
