“చెవులు కేవలం వినడానికే అనుకుంటాం, కానీ మన శరీరాన్ని సమతుల్యంగా (Balance) ఉంచడంలో చెవి కీలక పాత్ర పోషిస్తుంది. చెవిలో వచ్చే చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల అవి పెద్దవయ్యే అవకాశం ఉంది” అని డాక్టర్ ప్రగదీష్ హెచ్చరిస్తున్నారు.
సాధారణ చెవి సమస్యలు మరియు పరిష్కారాలు:
- చెవిలో హోరు (Tinnitus): సాధారణంగా మనం మాట్లాడే శబ్దం 30-35 డెసిబెల్స్ ఉంటుంది. ఇది 85 డెసిబెల్స్ దాటినప్పుడు చెవుడు లేదా హోరు వచ్చే ప్రమాదం ఉంది. చెవిలో నీరు చేరడం, గుబిలి (Wax) పేరుకుపోవడం లేదా లోపలి చెవిలో ద్రవాల (Lymph) స్థాయి పెరగడం వల్ల ఈ హోరు వస్తుంది. దీనికి సౌండ్ థెరపీ ద్వారా చికిత్స చేయవచ్చు.
- చెవిలో చీము (Ear Discharge): చెవి తనను తాను శుభ్రపరుచుకునే అవయవం. దానంతట అదే మైనం (Wax) వంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. దానిని తీయడానికి హెయిర్ పిన్స్, బడ్స్ వంటివి వాడటం వల్ల గాయాలై చీము పట్టే అవకాశం ఉంది. అలాగే జలుబు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల కూడా చీము రావచ్చు. దీనిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
- తలతిరగడం (Vertigo): కొంతమందికి పడకపై పక్కకు తిరిగినప్పుడు లేదా కూర్చున్న చోట నుండి లేచినప్పుడు విపరీతంగా తల తిరుగుతుంది. దీనిని పొజిషనల్ వెర్టిగో (Positional Vertigo) అంటారు. చెవి లోపలి భాగంలో ఉండే ద్రవాల అసమతుల్యత వల్ల ఇది వస్తుంది. స్కానింగ్ ద్వారా దీనిని గుర్తించి చికిత్స చేయవచ్చు.
చెవుల రక్షణ కోసం జాగ్రత్తలు:
- చెవిలో పుల్లలు, బడ్స్ అస్సలు పెట్టకూడదు.
- ఎక్కువ శబ్దం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
- సెల్ఫోన్లో మాట్లాడేటప్పుడు రెండు చెవులను మారుస్తూ ఉండాలి.
- వైద్యుని సలహా లేకుండా చెవిలో డ్రాప్స్ వేయకూడదు.
