టెహ్రాన్: అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా జరిపిన మెరుపు దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. అయితే, ఆయనతో పాటే ఉన్న కుమారుడు మరియు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఎలా ప్రాణాలతో బయటపడ్డారు? అనే ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
నరకప్రాయమైన ఆ నిమిషాలు: గత నెల 28న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, క్షిపణులతో విరుచుకుపడ్డాయి. టెహ్రాన్‌లోని తన కార్యాలయంలో అధికారులతో సమావేశానికి సిద్ధమవుతున్న సమయంలో అలీ ఖమేనీపై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన మరణించగా, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ (56) కొత్త నాయకుడిగా ఎంపికయ్యారు. అయితే మొజ్తబా ఇప్పటివరకు బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కోమాలో ఉన్నారని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
లీకైన ఆడియో – అసలేం జరిగింది?: సుప్రీం లీడర్ కార్యాలయంలోని ప్రోటోకాల్ విభాగం అధిపతి మజాహెర్ హొస్సేనీ వాయిస్‌తో ఉన్న ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆడియో ప్రకారం: “స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.32 గంటలకు దాడి జరిగింది. అలీ ఖమేనీ మరియు ఆయన కుటుంబ సభ్యులను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా ఈ దాడి సాగింది. అలీ ఖమేనీ మరణించగా, మొజ్తబా ఖమేనీ తృటిలో తప్పించుకున్నారు. దాడి జరిగిన సమయంలో ఆయన భవనం వెలుపల ఒక పని మీద ప్రాంగణంలో ఉన్నారు. ఆయన భవనం లోపలికి రావడానికి కొన్ని సెకన్ల సమయం పట్టే లోపే క్షిపణులు భవనాన్ని తాకాయి. దీంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు, కానీ కాలికి గాయమైంది.”
కుటుంబంలో భారీ ప్రాణ నష్టం: ఈ దాడి ఖమేనీ కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది. మొజ్తబా ఖమేనీ భార్య జహ్రా హద్దాద్-ఆడెల్ మరియు చిన్న కుమారుడు అక్కడికక్కడే మరణించారు. మరో కుమారుడు స్టఫా ఖమేనీ మరియు అతని భార్య ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. అయితే అలీ ఖమేనీ అల్లుడు మిస్బా అల్-హుదా బకేరి కానీ ఈ దాడిలో తల పగిలి మరణించారు. ఇరాన్ సైనిక కమాండర్ మొహమ్మద్ షిరాజీ మృతదేహం ఆచూకీ కూడా లభ్యం కాలేదు, కేవలం శరీర భాగాలు మాత్రమే దొరికాయని ఆ ఆడియోలో పేర్కొన్నారు.
ఈ లీకైన ఆడియో ప్రస్తుతం ఇరాన్ మద్దతు దేశాల్లో పెను కలకలం రేపుతోంది.
