హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ ప్రాంతంలో తెల్లవారుజామున ఒంటరిగా ప్రయాణించిన ఒక మహిళను అదనపు డబ్బులు డిమాండ్ చేస్తూ ఉబెర్ క్యాబ్ డ్రైవర్ చేసిన అరాచకం, ఆమె ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన బెదిరింపు సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
తనీషా శర్మ అనే ఆ మహిళ ఉదయం 4 గంటల ప్రాంతంలో ఉబెర్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకుంది. ప్రయాణం ముగిశాక యాప్‌లో చూపించిన ఛార్జీ కేవలం రూ. 625 మాత్రమే. అయితే, ఆ డ్రైవర్ మరో యాప్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను చూపించి రూ. 1,479 చెల్లించాలని బలవంతం చేస్తూ గొడవకు దిగాడు.
అదనంగా అడిగిన రూ. 854 ఇచ్చేందుకు నిరాకరించి, యాప్‌లో ఉన్న ఛార్జీని మాత్రమే ఇస్తానని ఆ మహిళ ఖచ్చితంగా చెప్పడంతో ఆగ్రహానికి గురైన డ్రైవర్.. కారు లాక్ చేసి ఆమె లగేజీని (వస్తువులను) తీసుకోనివ్వకుండా అడ్డుకున్నాడు.
అంతేకాకుండా, ఆ మహిళ చేతిని బలవంతంగా పట్టుకుని లాగి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. కాసేపు పోరాటం తర్వాత తనీషా తన వస్తువులను తీసుకుని ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ బూతులు తిడుతూ ఆమె ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించడం తీవ్ర భయాందోళనలను కలిగించింది.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు పర్యటించిన తనకు, సొంత దేశంలో, అది కూడా తెల్లవారుజామున ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం చాలా దురదృష్టకరం అని ఆ మహిళ తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసింది.
అంతేకాకుండా, అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉబెర్ యాప్‌లోని అత్యవసర సహాయక సేవ సరిగ్గా పనిచేయలేదని ఆమె ఆరోపించింది. ఈ సంఘటన ఇంటర్నెట్లో వైరల్ కావడంతో, ఉబెర్ సంస్థ ఈ విషయంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చింది.

Leave a Reply