ఐటీ దిగ్గజం ఒరాకిల్ (Oracle) సంస్థ భారత్‌లో పనిచేస్తున్న సుమారు 12,000 మంది ఉద్యోగులను అకస్మాత్తుగా తొలగించినట్లు సమాచారం.
అధికాల 5 గంటలకే ఉద్యోగుల ఇన్‌బాక్స్‌లకు వచ్చిన “మీ సేవలు ఇక అవసరం లేదు” (Redundant) అనే ఒక్క ఈమెయిల్, వేలాది మంది జీవనోపాధిని ప్రశ్నార్థకం చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30,000 మంది ఉద్యోగులను (మొత్తం సిబ్బందిలో 18%) ఆ సంస్థ తొలగించినట్లు తెలుస్తోంది. హెచ్‌ఆర్ లేదా మేనేజర్ల నుండి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే, ఈమెయిల్ వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సంస్థ యొక్క ఇంటర్నల్ యాక్సెస్ (లాగిన్ అనుమతి) రద్దు చేయడం ఉద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతపై ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి మరియు సంస్థను పునర్వ్యవస్థీకరించడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఒరాకిల్ పేర్కొంది. బాధిత ఉద్యోగులకు వారి పనికాలం ఆధారంగా పరిహారం మరియు నోటీస్ పీరియడ్ జీతం అందజేస్తామని చెప్పినప్పటికీ, అవి కేవలం ‘స్వచ్ఛంద రాజీనామా’ (Voluntary Resignation) చేసే వారికి మాత్రమే వర్తిస్తాయనే నిబంధన కొత్త చిక్కులను తెచ్చిపెట్టింది.
వచ్చే నెల రోజుల్లోపు రెండో విడత లేఆఫ్స్ ఉండవచ్చనే భయం ఐటీ ఉద్యోగుల్లో నెలకొంది. అమెజాన్ వంటి సంస్థల తర్వాత ఇప్పుడు ఒరాకిల్ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం టెక్ రంగంలో నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని (Recession) ధృవీకరిస్తోంది.
