తేని: తమిళనాడులోని తేని సమీప గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకుడికి, 19 ఏళ్ల యువతికి గత నెల 26వ తేదీన ఇరువైపులా పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన కేవలం 9 రోజులకే భార్యను అత్తగారింట్లో వదిలేసి, ప్రియురాలితో కలిసి పారిపోయాడు కొత్త పెళ్లికొడుకు. ప్రస్తుతం ఆ లవర్ బాయ్ తన ప్రియురాలితో కలిసి తిరుపూర్లో ఉన్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.
ఎవరినైనా ప్రేమిస్తే, సాధ్యమైతే వారినే పెళ్లి చేసుకోవాలి. అంతేకానీ, మనసులో ఒకరిని ఉంచుకుని, జీవితంలోకి కొత్తగా వచ్చిన భాగస్వామిని మోసం చేయకూడదు. కొందరు తల్లిదండ్రుల ఇష్టం కోసమో, స్నేహితుల ఒత్తిడి వల్లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు కానీ, పెళ్లయిన కొన్ని రోజులకే మళ్లీ పాత ప్రియురాలితో కలిసి పారిపోతుంటారు. ఇక్కడ జరిగింది కూడా అదే రకం. ప్రియురాలు వచ్చి పిలవగానే, పెళ్లాడిన భార్యను వదిలేసి పారిపోయాడో ఘనుడు.
అత్తగారింట్లో దించి అదృశ్యం
గత నెల 26న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఆ తర్వాత, జూలై 3వ తేదీన ఆ యువకుడు తన భార్యను తీసుకుని అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ భార్యను దించి, బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన వ్యక్తి మళ్లీ తిరిగి రాలేదు. అతని మొబైల్ ఫోన్ కూడా ‘స్విచ్ ఆఫ్’ వచ్చింది. కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో, ఆ నవవధువు తేని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల విచారణలో అసలు నిజం
పెళ్లయిన 9 రోజులకే కొత్త పెళ్లికొడుకు అదృశ్యమైన ఘటనపై మహిళా పోలీసులు విచారణ చేపట్టగా.. ఆ యువకుడు ప్రస్తుతం తిరుపూర్ ప్రాంతంలో ఉన్నట్లు తేలింది. ఈ పెళ్లి ఇష్టం లేకే, తాను ప్రేమించిన అమ్మాయితో కలిసి అతడు పారిపోయినట్లు విచారణలో వెల్లడైంది.
పోలీసుల వివరణ: “అదృశ్యమైన యువకుడు గతంలో ఒక మహిళను ప్రేమించాడు. ఆ మహిళకు ఇదివరకే పెళ్లయి, భర్తకు దూరంగా ఉంటోంది. ఈ విషయమై యువకుడి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించి, బలవంతంగా వేరే అమ్మాయితో పెళ్లి జరిపించారు. ఈ క్రమంలోనే అతడు అకస్మాత్తుగా ప్రియురాలితో పారిపోయాడు.”
ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై తదుపరి విచారణ జరుపుతున్నారు.
