కర్ణాటక: రోడ్డు పక్కన తేనె (Honey) కొనుగోలు చేసే వినియోగదారులారా.. జాగ్రత్త! అసలైన తేనె అని చెప్పి పంచదార పాకాన్ని విక్రయిస్తున్న ఒక ముఠా గుట్టును హాసన్ జిల్లాలో పోలీసులు రట్టు చేశారు.
మోసం జరుగుతున్న తీరు: హాసన్ జిల్లాలోని హోలెనరసిపుర పట్టణం APMC ప్రాంగణంలో నకిలీ తేనెను తయారు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన ఇది స్వచ్ఛమైన అడవి తేనె అని నమ్మిస్తూ విక్రయిస్తున్నారు. అసలు విషయం తెలియని అమాయక ప్రజలు దానిని నిజమైన తేనె అనుకుని కొని మోసపోతున్నారు.
వీరు బకెట్లలో పంచదార పాకాన్ని నింపి, అందులో తేనె పట్టు ముక్కలను వేసి అచ్చం తేనెలాగే కనిపించేలా తయారు చేస్తున్నారు. ప్రజల నుండి వచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి, ఈ కల్తీ తేనెను తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై హోలెనరసిపుర పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
