“దయచేసి చేతబడి చేయించకండి బాబోయ్..!” రూ.20 లక్షల్లో 19 లక్షలు క్షమాపణ లేఖతో తిరిగిచ్చేసిన దొంగ… పోలీసులనే షాక్‌కు గురిచేసిన విచిత్ర ఘటన!

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఒక చోరీ ఘటన స్థానిక పోలీసులను సైతం తీవ్ర ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంట్లో దొంగిలించిన లక్షలాది రూపాయల్లో సింహభాగాన్ని.. ఒక క్షమాపణ లేఖ రాసి దొంగే స్వయంగా తీసుకొచ్చి పడేసిన వింత సంఘటన నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

నరసరావుపేట పట్టణంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఆదినారాయణ రెడ్డి కుటుంబం ఇల్లు తాళం వేసి ఉండటాన్ని ఆసరాగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బంధువుల ఇంట్లో జరిగిన దశదిన కర్మకు వెళ్లి తిరిగి వచ్చేసరికి.. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని రూ.20 లక్షల నగదు, 317 గ్రాముల బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.

పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీలను పరిశీలించినప్పటికీ తొలుత ఎలాంటి ఆధారాలు లభించలేదు. రోజూ ఉదయం అపార్ట్‌మెంట్‌లో కరెంట్ పోయే సమయాన్ని పక్కాగా రెక్కీ నిర్వహించి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

అయితే ఈ కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధితుడు ఆదినారాయణ రెడ్డి నివాసం సమీపంలోని ఓ చెప్పుల దుకాణం వద్ద అనుమానాస్పదంగా ఒక బ్యాగ్ కనిపించింది. స్థానికులు దాన్ని తెరిచి చూడగా అందులో ఏకంగా రూ.19 లక్షల నగదుతో పాటు ఒక లేఖ ఉండటం చూసి అవాక్కయ్యారు.

ఆ లేఖలో.. “చోరీ చేసిన మొత్తంలో నా వాటాకు వచ్చిన రూ.19 లక్షలను తిరిగి ఇచ్చేస్తున్నాను. బంగారు నగల కోసం నన్ను ఇబ్బంది పెట్టకండి. దొంగలను కనిపెట్టేందుకు ఇంట్లో వాళ్లు చేతబడి, బాణామతి చేయిస్తున్నారని తెలిసి భయపడిపోయాను. నాపై ఎలాంటి మంత్రాలు ప్రయోగించకండి, నన్ను క్షమించి వదిలేయండి” అని దొంగ ప్రాధేయపడుతూ రాసుకొచ్చాడు.

పోలీసుల దర్యాప్తుతో పాటు బాధితులు చేతబడి చేయిస్తున్నారనే ప్రచారం దొంగ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి, దొంగిలించిన సొమ్మును తిరిగిచ్చేలా చేసింది. ప్రస్తుతం ఆ నగదు, లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వేలిముద్రలు, చేతిరాతను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి అసలు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


Posted

in

by

Tags: