UGC కొత్త నిబంధనలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ, సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్ (SRCC)లో ఒక దళిత విద్యార్థి, ఒక విద్యార్థినికి ప్రపోజ్ చేశాడని, ఆమె నిరాకరించడంతో అతను ఆమెపై UGC కొత్త ‘ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026’ కింద ఫిర్యాదు చేశాడని ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడానికి ఆమె ₹50,000 చెల్లించిందనే ఆరోపణలు కూడా వచ్చాయి.
జనరల్ కేటగిరీ విద్యార్థులకు వ్యతిరేకంగా SC/ST విద్యార్థులు UGC నిబంధనలను దుర్వినియోగం చేస్తారని ఈ వీడియోల ద్వారా ప్రచారం జరుగుతోంది.
కాలేజీ వివరణ: శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్ (SRCC) ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. తమ కాలేజీలో అసలు ఇటువంటి ఘటనే జరగలేదని స్పష్టం చేసింది. కాలేజీ మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం కోఆర్డినేటర్ హరీష్ కుమార్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని, కాలేజీకి అప్రతిష్ట తెచ్చేలా ఇవన్నీ సృష్టించబడ్డాయని తెలిపారు.
నేపథ్యం: విద్యాసంస్థల్లో కులం, మతం, లింగం లేదా వైకల్యం ఆధారంగా వివక్షను అరికట్టడానికి UGC ‘ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026’ను తీసుకువచ్చింది. అయితే, తప్పుడు ఫిర్యాదుల నుండి రక్షణ కల్పించే స్పష్టమైన నిబంధనలు ఇందులో లేవని కొందరు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ నిబంధనలపై స్టే విధించింది.
