దారుణం: AI సాయంతో యువతి అశ్లీల చిత్రాల సృష్టి.. రూ.50 వేలు ఇచ్చిన వదలని కేటుగాళ్లు, ఇద్దరి కోసం పోలీసుల గాలింపు!

ఉత్తరప్రదేశ్‌లోని భదోహీ జిల్లాలో ఒక సైబర్ కేఫ్ నిర్వాహకుడు, అతని సోదరుడు కలిసి 25 ఏళ్ల యువతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సృష్టించిన అశ్లీల చిత్రాలతో బ్లాక్‌మెయిల్ చేసిన ఉదంతం వెలుగుచూసింది. బాధితురాలి ప్రైవేట్ చాట్‌లను ఆన్‌లైన్‌లో లీక్ చేస్తామని బెదిరించిన ఈ ఇద్దరు నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

పోలీస్ అధికారుల కథనం ప్రకారం.. ఘోసియా ప్రాంతానికి చెందిన తాలిబ్ మరియు అతని సోదరుడు రఫీక్ అనే నిందితులు, సదరు యువతి ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతాలో పబ్లిక్‌గా ఉన్న ఫోటోలను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అనంతరం AI టూల్స్ ఉపయోగించి వాటిని అశ్లీల చిత్రాలుగా మార్చారు (మార్ఫింగ్ చేశారు). ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరిస్తూ ఆమె నుండి డబ్బు డిమాండ్ చేశారు.

తొలత తాలిబ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ యువతితో పరిచయం పెంచుకుని, చాటింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఆమె ప్రొఫైల్ లోని ఫోటోలను సేకరించి, AI ఎడిటింగ్ టూల్స్ ద్వారా నకిలీ అశ్లీల చిత్రాలను సృష్టించాడు. ఆ ఫోటోలను వైరల్ చేయకుండా ఉండాలంటే రూ. 50,000 ఇవ్వాలని బెదిరించడంతో, పరువు పోతుందనే భయంతో ఆ యువతి జ్ఞాన్‌పూర్ ప్రాంతంలో వారికి డబ్బులు అందజేసింది.

పెళ్లయినా ఆగని వేధింపులు
అయితే, అంతటితో ఈ వేధింపులు ఆగలేదు. కొన్ని నెలల తర్వాత ఆ యువతికి వివాహం జరగ్గా, నిందితులు ఆమె అత్తగారింటి చిరునామాను కనిపెట్టారు. అంతటితో ఆగక, మార్ఫింగ్ చేసిన అశ్లీల ఫోటోలను నేరుగా ఆమె భర్త మొబైల్ ఫోన్‌కు పంపి బెదిరింపులకు దిగారు. పాత చాట్ రికార్డులను బయటపెడతామని, ఎడిట్ చేసిన ఫోటోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తామని బెదిరిస్తూ మరింత డబ్బు డిమాండ్ చేశారు. బాధితురాలికి ఫిబ్రవరి 8, 2025న వారణాసిలో వివాహం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఏడాది మే 13న బాధితురాలి తండ్రి జిల్లా ఎస్పీ (Superintendent of Police) అభినవ్ త్యాగిని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు శుక్రవారం నిందితుల నివాసాలపై దాడులు చేశారు. అయితే అప్పటికే ఆ ఇద్దరు సోదరులు పరారయ్యారు.

కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం
ప్రస్తుతం పోలీసులు నిందితులపై బలవంతపు వసూళ్ల (Extortion) కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 308(2)తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) యాక్ట్ లోని పలు నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు.

ప్రాథమిక విచారణను బట్టి ఈ నేరం కేవలం ఒక మహిళకే పరిమితం కాలేదని, దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఇదే పద్ధతిలో AI సాంకేతికతను వాడుకుని మరికొంతమంది మహిళలను కూడా టార్గెట్ చేసి, లక్షలాది రూపాయలు వసూలు చేసి ఉంటారని భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళలను లక్ష్యంగా చేసుకుని డీప్‌ఫేక్ (Deepfake) తరహా మార్ఫింగ్, డిజిటల్ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడటంపై ఈ ఘటన మరోసారి తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.


Posted

in

by

Tags: