గుజరాత్‌లోని సూరత్‌లో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇక్కడి స్వామినారాయణ ఆలయ వాష్‌రూమ్‌లో ఇద్దరు కాలేజీ విద్యార్థినుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిద్దరూ ప్రాణ స్నేహితులు. వారు అదృశ్యమైన తర్వాత పోలీసులు జరిపిన విచారణలో, వారి మొబైల్లోని ChatGPT సెర్చ్ హిస్టరీ వారి మరణానికి సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టింది.
అసలేం జరిగింది? మృతులను రోష్ని శిర్సాత్ (18), జోష్నా చౌదరి (20)గా గుర్తించారు. వీరు సూరత్‌లోని దిండోలి ప్రాంతానికి చెందినవారు. రోజులాగే స్కూటర్‌పై కాలేజీకి వెళ్లిన యువతులు రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా తనిఖీ చేయగా, సూరత్ సమీపంలోని ‘ఆత్మీయ సంస్కార్ ధామ్’ స్వామినారాయణ ఆలయ పరిసరాల్లో వారి లొకేషన్ ఉన్నట్లు తేలింది.
CCTV ఫుటేజీ మరియు వాష్‌రూమ్ దృశ్యాలు: పోలీసులు ఆలయానికి చేరుకోగా అక్కడ యువతుల స్కూటర్ కనిపించింది. CCTV ఫుటేజీని పరిశీలించగా, ఆ ఇద్దరు యువతులు ఆలయ వాష్‌రూమ్‌లోకి వెళ్లడం కనిపించింది, కానీ తిరిగి బయటకు రాలేదు. అనుమానం వచ్చిన పోలీసులు వాష్‌రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా, ఇద్దరూ అపస్మారక స్థితిలో కింద పడి ఉన్నారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ChatGPT హిస్టరీలో కీలక ఆధారాలు: పోలీసులు వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. “నొప్పి లేకుండా ప్రాణాలు ఎలా తీసుకోవాలి?” (how to end life without pain) అని వారు ChatGPTలో సెర్చ్ చేసినట్లు హిస్టరీలో కనిపించింది. అంతేకాకుండా, అనస్థీషియా (Anesthesia) మందు ఓవర్ డోస్ వల్ల జరిగే మరణాలకు సంబంధించిన వార్తల స్క్రీన్ షాట్లు కూడా వారి ఫోన్లలో ఉన్నాయి. మృతదేహాల వద్ద అనస్థీషియా బాటిళ్లు, సిరంజీలు లభించడంతో వారు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వారు ఈ విపరీత నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు వారి కాల్ డేటా రికార్డులను పరిశీలిస్తున్నారు.
