వారికి పెళ్లై 35 ఏళ్లు. ఆయన వయస్సు 61 ఏళ్లు. గత నెలలోనే ఉద్యోగ విరమణ చేసి, ఇంట్లో భార్యతో ప్రశాంతంగా గడుపుతున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు కేవలం ఉదయం, రాత్రి మాత్రమే భార్యను చూసేవారు. అది కూడా కొన్ని మాటలతోనే సరిపోయేది. ఆదివారాలు కూడా ఏదో ఒక పని మీద బయటకెళ్లిపోయేవారు. కుటుంబం కోసం ఆయన రాత్రింబవళ్లు కష్టపడ్డారు.
ఇప్పుడు తీరిక దొరకడంతో భార్యతో మనసు విప్పి మాట్లాడాలనిపించింది. ఇంటి వరండాలో కూర్చున్న ఆయన భార్యను పిలిచారు. ఆమె ఆయన కంటే 8 ఏళ్లు చిన్నది, 52 ఏళ్ల వయస్సులోనూ చాలా చురుగ్గా పనులు చేస్తోంది. ఆమె దగ్గరకు రాగానే, “రా.. కూర్చో, నీతో మనసు విప్పి మాట్లాడి ఎన్ని రోజులయిందో!” అంటూ ఆమె చేయి పట్టుకున్నారు.
ఆమె అరచేయి గరుకుగా తగలడంతో, ఆయన ఆమె అరచేతిని తిప్పి చూశారు. ఆయన కళ్లు చెమర్చాయి. “అమ్ము.. ఏంటిది? చేయి నిండా కోత గాయాలు ఉన్నాయి. గోళ్లు కూడా చిట్లిపోయాయి. నువ్వు పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు నీ చేతులు పట్టులా మెరుస్తూ ఉండేవి కదా.. ఏమైంది?” అని అడిగారు.
ఆమె చిన్నగా నవ్వుతూ.. “ఈ 35 ఏళ్లలో వంట చేసేటప్పుడు నూనె పడి ఉండొచ్చు.. కూరగాయలు కోసేటప్పుడు కత్తి తగిలి ఉండొచ్చు.. పాత్రలు దించేటప్పుడు వాతలు పడి ఉండొచ్చు.. ఇలా ఎన్నెన్నో జరిగాయి” అంది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
ఆయన కంగారుగా, “అమ్ము.. ఈ చేయి మీద ఇంత పెద్ద కాలిన గాయం ఎలా అయింది?” అని అడిగారు. ఆమె మెల్లగా, “నాలుగేళ్ల క్రితం ఒకరోజు మీ బండి మీద ఉన్న కవర్ తీసుకురమ్మన్నారు. అది కింద పడితే తీయబోయాను, అప్పుడే వచ్చిన మీ బండి సైలెన్సర్ వేడి తగిలి చేయి కాలింది” అని చెప్పింది. “మరి నాకెందుకు చెప్పలేదు అమ్ము?” అన్నారాయన. “చెప్పలేదు.. ఏ గాయం గురించి నేను చెప్పలేదు. చెబితే మీరే తిడతారేమో అని భయం.. ‘బాధ్యత లేదా? చూసుకుని నడవవా?’ అని అంటారని చెప్పలేదు.”
ఆయన బాధతో, “ఇవేవీ నా కంట పడలేదే అమ్ము!” అన్నారు. అందుకు ఆమె, “మనం కలుసుకునేదే రాత్రి చీకటిలో.. అది కూడా కొద్ది నిమిషాలే కదా. ఇక నా ఒంటి మీద గాయాలు మీకెలా కనిపిస్తాయి?” అని అడిగింది.
“అమ్ము.. అలా అనుకోకు. మీ కోసమే కదా నేను రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడ్డాను. పిల్లలను విదేశాలకు పంపించాను. నిన్ను ఏ లోటు లేకుండా చూసుకున్నాను కదా!” అన్నారాయన. ఆమె నెమ్మదిగా, “ఒంటి మీద గాయాలు మీకు ఇప్పుడైనా కనిపిస్తున్నాయి కానీ.. నా మనసు మీద అయిన గాయాలు మీకు ఎప్పటికీ కనిపించవు..” అని అంది.
ఆయన పశ్చాత్తాపంతో.. “నన్ను క్షమించు అమ్ము.. డబ్బు సంపాదించే వేగంలో యంత్రంలా మారిపోయాను” అని ఆమె చేతిని అదిమి పట్టుకున్నారు. “నాదొక కోరిక.. ఇప్పుడైనా తీర్చగలరా?” అని ఆమె అడిగింది. “అడుగు అమ్ము..” “పెళ్లైన కొత్తలో కొన్ని రోజులు నేను మీ ఒడిలో, మీరు నా ఒడిలో తలపెట్టుకుని పడుకునేవాళ్లం. ఆ తర్వాత 35 ఏళ్లు కేవలం దిండు మీద తలపెట్టే పడుకున్నాం. ఇప్పుడు కాసేపు మీ ఒడిలో తలపెట్టుకుని పడుకోనా?” అని అడిగింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన ఆమెను హత్తుకుని తన ఒడిలో పడుకోబెట్టుకుని ఒక చిన్న బిడ్డలా చూశారు.
ముగింపు: మనసు నిండా ప్రేమ ఉన్నా, పురుషులకు దానిని వ్యక్తపరచడం తెలియదు. చాలామంది మహిళల జీవితాలు ఇలాగే ముగుస్తాయి. పెళ్లి సమయంలో ఉన్న మెత్తదనం వారి చేతులే కాదు, మనసు కూడా కోల్పోతుంది. పురుషులారా! మీ భార్యల చేతులు పట్టుకుని చూడండి.. ఎన్ని గాయాలు ఉన్నాయో అడగండి.. అప్పుడు వారి మనసు గాయాలు బయటపడతాయి.
