దైవదూషణ చేశారన్న నిరాధారమైన ఆరోపణలతో గుంపు దాడిలో ప్రాణాలు కోల్పోయిన దీపు చంద్ర దాస్ కేసులో విచారణ వేగవంతమైంది. అతడు పని చేస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యం మరియు సహోద్యోగులే ఈ ఘోరానికి ప్రధాన కారకులని దర్యాప్తులో తేలింది.
గద్దారీ (నమ్మకద్రోహం) చేసిన స్నేహితులు: దీపు పనిచేస్తున్న గార్మెంట్ ఫ్యాక్టరీలోని ఫ్లోర్ ఇంచార్జ్ మరియు క్వాలిటీ ఇంచార్జ్ (అతని స్నేహితులు) అతడిని కాపాడాల్సింది పోయి, ఉగ్రవాద మూకలకు అప్పగించారు. ఈ కిరాతకంలో ఇప్పటికే 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఫ్యాక్టరీ అధికారులు కూడా ఉన్నారు.
కుట్ర పూరితంగా హత్య: ఇది ఆవేశంలో జరిగిన హత్య కాదని, ముందే ప్లాన్ చేసిన కుట్ర అని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
- బలవంతపు రాజీనామా: ఫ్యాక్టరీ అధికారులు దీపుతో బలవంతంగా రాజీనామా చేయించారు.
- పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం: మధ్యాహ్నం 4 గంటలకే గొడవ మొదలైనా, రాత్రి 9 గంటల వరకు పోలీసులు రాకుండా యాజమాన్యం జాగ్రత్త పడింది.
- మృత్యువుకు అప్పగింత: సెక్యూరిటీ రూమ్‌లో ఉన్న దీపును బయటకు తీసుకొచ్చి దాడి చేస్తున్న మూకలకు ఫ్యాక్టరీ అధికారులే అప్పగించారు.
అమానవీయ ఘటన: శిఫ్ట్ మారుతున్న సమయంలో వేలాది మంది కార్మికులు, స్థానికులు కలిసి దీపును దారుణంగా కొట్టి చంపారు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని హైవేపై వేలాడదీసి, నిప్పు పెట్టారు. దీపుకు భార్య, ఒకటిన్నర ఏళ్ల చిన్న బాబు ఉన్నారు.
తస్లీమా నస్రీన్ ఆవేదన: ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. “ఈ ఘోరమైన హత్యకు పాల్పడిన వారికి శిక్ష పడుతుందా?” అని ప్రశ్నించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కావాలనే ‘నకిలీ రాజీనామా’ చేయించి బయటకు నెట్టడం వారి క్రూరత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.
