అబుదాబి: ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని దుబాయ్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గత 76 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదు కావడంతో నగరం అతలాకుతలమైంది. ప్రధాన రహదారులు జలమయం కావడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
అధికారుల హెచ్చరికలు:
పరిస్థితి తీవ్రతను గమనించిన దుబాయ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. “ప్రజల భద్రత దృష్ట్యా.. రాబోయే కొన్ని గంటల పాటు వాతావరణం అస్థిరంగా ఉంటుంది. కాబట్టి అత్యవసరమైతే తప్ప శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎవరూ బయటకు రావద్దు” అని కోరారు. దుబాయ్ మరియు అబుదాబిలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH):
భారీ వర్షాల దృష్ట్యా ప్రైవేట్ రంగ సంస్థలు తమ ఉద్యోగులకు ఈరోజు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సదుపాయం కల్పించాలని మానవ వనరుల శాఖ సూచించింది. అంతకుముందే ప్రభుత్వ ఉద్యోగులందరూ రిమోట్గా పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
విమాన సర్వీసుల రద్దు:
వరదల కారణంగా విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిన్న రాత్రి మరియు ఈరోజు ఉదయం బయలుదేరాల్సిన అనేక విమానాలు రద్దయ్యాయి. ముఖ్యంగా లండన్, ఫ్రాంక్ఫర్ట్ వెళ్లే ఎమిరేట్స్ విమానాలు మరియు బహ్రెయిన్ వెళ్లే ఫ్లై దుబాయ్ సర్వీసులు రద్దు చేయబడ్డాయి. రహదారులపై కార్లు వరద నీటిలో మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
