కన్నబిడ్డలా ప్రాణంగా పెంచి పెద్దచేసిన దత్తపుత్రుడు, కోడలు కలిసి తమను ఇంటి నుంచి గెంటివేశారంటూ ఓ వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరవుతున్న వీడియో ఇంటర్నెట్‌లో తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తిస్తోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాకు చెందిన ఈ వృద్ధ దంపతులు.. తాము ఎంతో కష్టపడి రూ.75 లక్షల ఖర్చుతో నిర్మించుకున్న ఇంటిని తమ పెంపుడు కొడుకు కేవలం రూ.46 లక్షలకే అమ్మేసి తమను నిరాశ్రయులుగా మార్చాడని ఆవేదన వ్యక్తం చేశారు.
కన్నకొడుకులా చూసుకుని, చదివించి ప్రయోజకుడిని చేస్తే ఇలా దగా చేస్తాడని ఆ దంపతులు కలలో కూడా ఊహించలేదు. కొడుకు, కోడలి వేధింపులు తాళలేక ఇల్లు వదిలి బయటకు వచ్చిన ఆ వృద్ధ దంపతులు, ప్రస్తుతం గత్యంతరం లేక వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు.
తమకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలంటూ ఈ వృద్ధ దంపతులు 2022 నుంచి సోషల్ మీడియాలో నిరంతరం వీడియోలు పోస్ట్ చేస్తూ సాయం కోరుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 1,000కి పైగా వీడియోలను పోస్ట్ చేసి తమ బాధను చెప్పుకున్నప్పటికీ, గడిచిన రెండు మూడేళ్లుగా వారికి ఎలాంటి న్యాయం జరగలేదు.
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన వీరి తాజా వీడియో లక్షలాది మంది దృష్టిని ఆకర్షించి వైరల్‌గా మారింది. రూ.75 లక్షల ఇంటిని రూ.46 లక్షలకే విక్రయించేసి, నేడు చిల్లిగవ్వ లేక ఒక్కో రూపాయి కోసం తమను నడిరోడ్డున పడేలా చేశాడంటూ ఆ దంపతులు కన్నీటితో చెప్పిన మాటలు చూపరుల హృదయాలను కదిలిస్తున్నాయి.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ కొడుకు చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇలాంటి కొడుకుని భగవంతుడు ఎవరికీ ఇవ్వకూడదు” అని, “పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టడం కంటే తల్లిదండ్రులు తమ జీవితకాలంలో ప్రశాంతంగా, సంతోషంగా బతకడమే మేలు” అని నెటిజన్లు తీవ్ర భావోద్వేగంతో స్పందిస్తున్నారు.
