దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఓ దారుణ ఘటన ప్రజలను తీవ్రంగా కలచివేసింది.
ఆ ఘటన మరువకముందే… ఒడిశాలోనూ దాదాపు ఇదే తరహాలో ఓ యువ జంటపై దాడి జరిగినట్లు వార్తలు రావడం కలకలం రేపుతోంది.
ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఒడిశాలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతమైన ఢెంకనాల్ జిల్లాకు సమీపంలోని ఓ ప్రాంతానికి నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై వెళ్లారు. వారిలో ఓ యువ జంట కూడా ఉన్నారు.
ఆలయంలో దర్శనం పూర్తిచేసుకున్న అనంతరం… నలుగురూ తమ స్వగ్రామానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
అయితే… అదే సమయంలో అనూహ్యంగా వారి బృందంలోని ఒక వ్యక్తికి అక్కడి స్థానికులతో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో… ఓ స్థానికుడు తన కుటుంబ సభ్యులు, బంధువులను అక్కడికి పిలిచినట్లు సమాచారం.
కొద్దిసేపటికే అక్కడ స్థానికుల గుంపు చేరింది.
ఆ తర్వాత యువ జంటతో పాటు వారితో వచ్చిన వ్యక్తులపై దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
దాడి నుంచి తమను విడిచిపెట్టాలని బాధితులు చేతులు జోడించి వేడుకున్నప్పటికీ… గుంపు వారిపై దాడి చేసినట్లు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది.
ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్లో వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఆ వీడియో వైరల్ కావడంతో… ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వీడియో ఆధారంగా పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అనంతరం కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు సమాచారం.
ఈ ఘటనపై ఢెంకనాల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అభినవ్ సోంకర్ స్పందించారు.
ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అరెస్టయిన ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారని వెల్లడించారు.
వారిని విచారిస్తున్నామని… ఈ దాడికి అసలు కారణం ఏమిటన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుందని చెప్పారు.
అలాగే… ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న పరారీలో ఉన్న ఇతర వ్యక్తుల కోసం కూడా గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
మొత్తంగా… ఆలయం నుంచి తిరిగి వస్తున్న యువ జంటపై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. కేసులో పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెల్లడికానున్నాయి.

Leave a Reply