“దొంగతనాలకు ట్యూషన్ చెప్పిన ‘పప్పూ’.! కుర్రాళ్లకు స్కెచ్ వేయడం నేర్పించినట్లు దిగ్భ్రాంతికర నివేదికలు.. 70కి పైగా కేసులు.. రూ.10 లక్షల నగలతో చిక్కిన మాస్టర్‌మైండ్.!!”

యువకులను దొంగతనాలకు పురికొల్పి, వారికి దొంగతనాల్లో శిక్షణ ఇచ్చాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రేమ్‌నాథ్ అలియాస్ పప్పూ అనే ప్రధాన నిందితుడిని జబల్‌పూర్ పోలీసులు భోపాల్‌లో అరెస్టు చేశారు.

అతనితో సంబంధం ఉన్న ముఠాకు చెందిన యువకులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా, విచారణలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమ్‌నాథ్‌పై మధ్యప్రదేశ్‌తో సహా పలు ప్రాంతాల్లో 70కి పైగా దొంగతనాలు, ఇళ్ల కన్నాల కేసులు ఉన్నట్లు తెలిసింది. యువకులను తన ముఠాలో చేర్చుకుని, దొంగతనాలకు ఉపయోగించుకునేవాడని, వారికి రకరకాల దొంగతనాల మెళకువల్లో శిక్షణ ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు.

జబల్‌పూర్‌లోని అర్ణవ్ విహార్ ప్రాంతంలో పోలీసు శాఖలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో జరిగిన దొంగతనం సంఘటనపై దర్యాప్తు చేస్తుండగా ఈ ముఠా గుట్టు రట్టయింది. సర్వైలెన్స్ కెమెరా రికార్డింగ్‌ల ఆధారంగా 19 ఏళ్ల సూరజ్, 22 ఏళ్ల విజయ్, 18 ఏళ్ల లక్ష్మణ్‌లాల్ అనే ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి విచారణలోనే ప్రేమ్‌నాథ్ పేరు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చేపట్టిన పోలీసులు భోపాల్‌లో దాక్కున్న ప్రేమ్‌నాథ్ అలియాస్ పప్పూను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా దాదాపు రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దొంగిలించిన నగలను కొనుగోలు చేసి కరిగించే జైప్రకాష్ సోనీ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ్‌నాథ్‌ను కస్టడీకి తీసుకుని పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags: