ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్‌గంజ్ ప్రాంతంలో, అర్ధరాత్రి వేళ ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి రహస్యంగా వచ్చిన ఒక యువకుడిని దొంగ అని భావించి ఇంటి యజమాని బయట నుంచి గడియ పెట్టిన ఘటన, ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపడమే కాకుండా హాస్యాస్పద వాతావరణాన్ని సృష్టించింది.
రాత్రి 11 గంటల సమయంలో ఇంటి గదిలోంచి ఏదో శబ్దం రావడం విన్న ఆ మహిళ, ఎవరో దొంగే ఇంట్లోకి చొరబడ్డాడని పొరబడింది. ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే గది తలుపును బయట నుంచి గడియ పెట్టేసి “దొంగ.. దొంగ..” అని గట్టిగా అరిచింది.
ఆమె కేకలు విని చుట్టుపక్కల ప్రజలు పరుగెత్తుకొచ్చి ఇంటిని చుట్టుముట్టడమే కాకుండా, వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు లాక్ చేసి ఉన్న తలుపులు తీసి చూడగా, లోపల భయంతో వణికిపోతూ నిలబడి ఉన్న ఆ యువకుడిని పట్టుకుని విచారించారు.
విచారణలో తాను దొంగను కానని, జ్వరంతో బాధపడుతున్న తన ప్రియురాలికి టాబ్లెట్లు ఇవ్వడానికే ఎవరికీ తెలియకుండా ఆ గదిలోకి వచ్చానని అతను చెప్పిన మాటలు విని అక్కడున్న పోలీసులు, గ్రామస్తులు నోరెళ్లబెట్టారు.
అనంతరం ఆ యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా, వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారని, ఆ యువకుడి సోదరి అదే గ్రామంలో వివాహం చేసుకుని నివసిస్తుండటంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని తెలిసింది.
రెండు వైపుల కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చర్చలు జరిపిన పోలీసులు, కేసు నమోదు చేయకుండా ఇరువైపులా పెద్దల అంగీకారంతో వారికి పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. దొంగ అని అనుకుని గదిలో బంధించిన ఒక ఘటన, చివరికి ప్రేమికుల పెళ్లితో ముగియడం అనే ఈ ఆసక్తికరమైన వార్త ఆ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply