తాజా ద్రాక్ష పండ్లు చూడటానికి చాలా సురక్షితంగా, మెరుస్తూ కనిపిస్తాయి. కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉంటుంది. ద్రాక్ష పండ్ల పైన పురుగుల మందుల అవశేషాలు (Pesticides), మైనం (Wax) మరియు దుమ్ము పేరుకుపోయి ఉంటాయి. ద్రాక్ష గుత్తులుగా పెరగడం వల్ల వాటి మధ్యలో కెమికల్స్ సులభంగా ఇరుక్కుపోతాయి. కేవలం టాప్ వాటర్ కింద కడిగితే ఇవి పూర్తిగా పోవు. వీటిని శుభ్రం చేసే సరైన పద్ధతి ఇప్పుడు చూద్దాం.
ఎందుకు బాగా కడగాలి? ఎన్విరాన్‌మెంటల్ వర్కింగ్ గ్రూప్ (EWG) ప్రకారం, 2025లో అత్యధిక పురుగుల మందుల అవశేషాలు ఉన్న పండ్ల జాబితాలో ద్రాక్ష 4వ స్థానంలో ఉంది. కీటకాలు, బూజు నుండి రక్షించడానికి వీటిపై పదేపదే మందులు చల్లుతారు. అందుకే వీటిని పిల్లలకు ఇచ్చే ముందు జాగ్రత్తగా శుభ్రం చేయాలి.
శుభ్రం చేసే పద్ధతులు:
- చల్లని నీరు: ముందుగా ద్రాక్షను ప్రవహించే చల్లని నీటి కింద 20 నుండి 30 సెకన్ల పాటు ఉంచాలి. దీనివల్ల పైన ఉన్న దుమ్ము, మట్టి పోతాయి.
- బేకింగ్ సోడా: ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం. లీటరు నీటిలో ఒక చెంచా బేకింగ్ సోడా కలిపి, అందులో ద్రాక్షను 10-15 నిమిషాల పాటు నానబెట్టాలి. బేకింగ్ సోడా పురుగుల మందులను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. ఆ తర్వాత మంచి నీటితో కడగాలి.
- వినెగర్: బ్యాక్టీరియా మరియు క్రిములను తొలగించడానికి వినెగర్ ఉపయోగపడుతుంది. మూడు వంతుల నీటిలో ఒక వంతు వినెగర్ కలిపి ద్రాక్షను 5-10 నిమిషాలు నానబెట్టి, ఆపై శుభ్రంగా కడగాలి.
కడిగిన తర్వాత ద్రాక్షను మెత్తని క్లాత్‌తో తుడిచి ఆరనివ్వాలి. పొడిగా ఉన్న ద్రాక్ష ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.
