“నకిలీ నోట్లతో విలాసవంతమైన జీవితం.. బెంగళూరులో ‘బాక్స్ బెడ్’ను తెరిచిన పోలీసులకు షాక్!”

బెంగళూరు: బెంగళూరులో నకిలీ నోట్లను చలామణి చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న 41 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అతని ఇంటికి వెళ్లగా, తల్లిదండ్రులు అతడిని ‘బాక్స్ బెడ్’ (బాక్సు మంచం)లో దాచిపెట్టిన ఘటన సంచలనం సృష్టించింది.

కర్ణాటకలోని తుమకూరు జిల్లా, చికనాయకనహళ్లి తాలూకా హులియారు గ్రామంలో జూలై 2న ఒక వ్యక్తి దుకాణానికి వెళ్లి రూ. 500 నోటు ఇచ్చి సిగరెట్లు కొన్నాడు. అయితే, అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన షాపు యజమాని నోటును పరిశీలించగా, అది నకిలీదని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో ఆ వ్యక్తి బెంగళూరు సంపంగి లే-అవుట్‌లో నివసించే రుద్రేష్ (41) అని తేలింది.

పోలీసులు రుద్రేష్‌ను అరెస్ట్ చేసేందుకు అతని ఇంటికి వెళ్లారు. అక్కడ ఉన్న తల్లిదండ్రులు, తమ కొడుకు ఇంట్లో లేడని, అతను ఎలాంటి నకిలీ నోట్లు చలామణి చేయలేదని బుకాయించారు. కానీ, పోలీసులకు అనుమానం వచ్చి ఇల్లంతా గాలించారు. ఎక్కడా దొరకకపోవడంతో తల్లిదండ్రులను కఠినంగా ప్రశ్నించగా, చివరకు కొడుకును బాక్స్ బెడ్‌లో దాచినట్లు ఒప్పుకున్నారు. వెంటనే పోలీసులు బెడ్‌ను తెరిచి చూడగా, లోపల రుద్రేష్ కనిపించాడు. అతడిని అరెస్ట్ చేసి విచారించగా, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో నకిలీ నోట్లు చలామణి చేస్తూ విలాసంగా బతుకుతున్నట్లు వెల్లడైంది.

గతంలో 2024లో దావణగెరె పోలీసులు రూ. 20 లక్షల నకిలీ నోట్ల తయారీ కేసులో రుద్రేష్‌ను అరెస్ట్ చేశారు. ఆ కేసులో జైలుకు వెళ్లి బయటకు వచ్చిన తర్వాత, మళ్ళీ అదే పనికి పాల్పడినట్లు తేలింది. ప్రస్తుతం ఈ కేసులో అతనితో సంబంధం ఉన్న మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.


Posted

in

by

Tags: